Shah Rukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ గ్రాండ్ సక్సెస్ చూసి చాలా ఏళ్ళయింది. వచ్చే యేడాది మూడు సినిమాలతో మురిపించడానికి షారుఖ్ సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ సినిమా జనవరి 25న జనం ముందు నిలువనుంది. దర్శకుడు అట్లీ తెరకెక్కించే ‘జవాన్’ కోసం ఇటీవల 30 రోజులు చెన్నైలో గడిపారు షారుఖ్. అటు నుండి రాగానే రాజ్ కుమార్ హిరాణీ ‘డంకీ’ సినిమా షూటింగ్ కోసమూ రాత్రిపూట పనిచేశారు. అంతేకాదు ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల దాకా 500 మందితో కలసి షూటింగ్ లో పాల్గొన్నారు షారుఖ్. సినిమాలో రేసింగ్ సీక్వెన్స్ గా రానున్న ఈ సీన్ కోసం ఆదివారం స్పెషల్ పర్మిషన్ తీసుకొని మరీ చిత్రీకరించారు. ఎలాగైనా సరే మళ్ళీ తన అభిమానులను మునుపటిలా మురిపించాలని షారుఖ్ తపిస్తున్నారు. ఆ తపనలో భాగంగానే గ్యాప్ లేకుండా నటించడానికీ సై అంటున్నారాయన.
షారుఖ్ పనిచేస్తున్న తీరును చూసి ఆయనతో పాటు షాట్ లో పాల్గొన్న బొమన్ ఇరానీ వంటివారు కూడా ఉత్సాహంగా పనిచేయడం విశేషం! ‘డంకీ’లో తాప్సీ పన్ను నాయికగా నటిస్తోంది. ఈ సినిమా 2023 డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని హిరాణీ ప్లాన్ చేశారు. ఇక షారుఖ్ ‘జవాన్’ సినిమా జూన్ 2న ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో నయనతార, ప్రియమణి, విజయ్ సేతుపతి వంటివారు నటిస్తున్నారు. దాంతో అటు ఉత్తరాన, ఇటు దక్షిణాదిన సందడి చేయాలని షారుఖ్ తపన. ఇక ‘పఠాన్’ టైటిల్ ను బట్టి ఇప్పటికే కొందరు ఈ సినిమాను ‘బాయ్ కాట్’ చేయాలనీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కానీ, ‘పఠాన్’లో షారుఖ్ కు అచ్చివచ్చిన తార దీపికా పదుకొణే నాయికగా నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ బాబులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ మూడు సినిమాల కోసం ఎంతో తపించి నటించిన షారుఖ్ కు ఈ చిత్రాలు ఏ స్థాయిలో ఆనందం పంచుతాయో చూడాలి.
