senior cartoonist papa passes away: ప్రముఖ కార్టూనిస్టు పాప (77) శనివారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు కొయ్య శివరామరెడ్డి. బాల్యంలోనే వ్యంగ్య చిత్రాలు గీయడంలో పట్టు సంపాదించిన ఆయన తొలి కార్టూన్ ఆంధ్ర ప్రతికలో ప్రచురితమైంది. ఆ తర్వాత కథలకు బొమ్మలు గీయడంలోనూ ఆయన ప్రావీణ్యం సంపాదించారు. యుక్తవయసులోనే ఆంధ్ర పత్రిక, వసుధ, జోకర్ తదితర వార, మాస పత్రికలకు బొమ్మలు గీశారు. కాలేజీ విద్య పూర్తయ్యాక విశాఖ టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గా కొంత కాలం పనిచేసి, మధ్యలో కర్ణాటక లో ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేసారు. తర్వాత హైదరాబాద్ ఎన్.జి.ఆర్.ఐ.లో ఆర్టిస్టుగా పనిచేశారు. బాపు, రమణ సలహాలో, 1975లో ఈనాడు దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా చేరారు.
Read Also: Panipuri Challenge: ఈ పానీపూరీ తింటే రూ.500 మీదే..!!
ఈనాడులో పాప వేసిన ఫస్ట్ పేజీ కార్టూన్లు అప్పట్లో బాగా పేలేవి. ముఖ్యంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అంజయ్య మీద పాప విరివిగా కార్టూన్లు వేశారు. ముఖ్యమంత్రి అంజయ్య వాడే హెలికాప్టర్ యాదిగిరిని ఆయన అంజయ్య చిత్రం పక్కనే సెటైరికల్ గా గీస్తుండే వారు. తెలుగు పొలిటికల్ కార్టూనిస్టులలో పాప తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎనిమిదేళ్లు ఈనాడులో పనిచేశాక 1982లో ఆయన ఫ్రీలాన్స్ కార్టూనిస్టు గా మారారు. ఆంధ్రభూమి, సమయం, ఆంధ్రప్రభ పత్రికల్లో కార్టూన్లు గీశారు. మధ్యలో ఈ వారం వారపత్రిక నడిపారు. పాపా తన చిత్రాలతో హైదరాబాద్, విజయవాడలలో వన్మేన్ షోలు, గ్రూప్ షోలు నిర్వహించారు. 2000 సం. లో కార్టూన్ వాచ్ పత్రిక వారు వీరి కార్టూన్లను లండన్ నెహ్రు సెంటర్ లో ప్రదర్శించారు. 2002 సంవత్సరం హైదరాబాద్ లో ఏ.పి. ప్రెస్ అకాడెమి, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఆధ్వర్యంలో బాపుగారి చేతులమీదుగా సత్కారం అందుకున్నారు. ఫోటోగ్రఫీ లోను ఎన్నోప్రయోగాలు చేసిన వీరిని నాలుగు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 1944 ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన పాప గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్యులు చేసిన సర్జరీ విఫలం కావడంతో శనివారం కన్నుమూశారని, అంత్యక్రియలు ఆదివారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.