NTV Telugu Site icon

Prabha: చిత్రం… భళారే విచిత్రం… ప్రభ అభినయం!

Prabha

Prabha

Prabha: నాటి మేటి నటుల సరసననే కాదు, ఆ నాటి వర్ధమాన కథానాయకులతోనూ మురిపించారు నటి ప్రభ. అయితే ఆమె పేరుకు తగ్గట్టుగా ఎందుకనో హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మ లేకపోయారనే చెప్పాలి. ప్రభ అభినయ పర్వం చిత్రంగా… భళారే విచిత్రంగా సాగిందనే భావించాలి. ఏది ఏమైనా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు ప్రభ. నాట్యంలోనూ ఎంతో ప్రావీణ్యమున్న ప్రభ దేశవిదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు.

ప్రభ పూర్తి పేరు కోటి సూర్య ప్రభ. తెనాలిలో 1958 అక్టోబర్ 20న ప్రభ జన్మించారు. లలిత కళల్లో ప్రావీణ్యమున్న ఇంట్లో పుట్టడం వల్ల ప్రభకు బాల్యంలోనే కన్నవారు నాట్యం నేర్పించారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వద్ద నాట్యశిక్షణ పొందారు. నాజూకు దేహంతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే ప్రభ తొలుత ‘నీడలేని ఆడది’ చిత్రంలో తెరపై కనిపించారు. “అమ్మాయిలు జాగ్రత్త, అన్నదమ్ముల కథ, రామయ్య తండ్రి, అత్తవారిల్లు, అల్లుడొచ్చాడు” వంటి చిత్రాలలో ద్వితీయ నాయికగా నటించారు. అక్కినేని ‘మహాకవి క్షేత్రయ్య’లో క్షేత్రయ్య మరదలు రుక్ష్మిణిగా నటించారు. యన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన పౌరాణిక చిత్రం ‘దానవీరశూర కర్ణ’లో ఏకంగా రారాజు సుయోధనుని భార్య భానుమతి పాత్రలో నటించారు. అందులో “చిత్రం భళారే విచిత్రం…” అంటూ సాగే గీతంలో యన్టీఆర్ సరసన ప్రభ నటించారు. ఆ చిత్ర ఘనవిజయంతో ప్రభ పేరు మారుమోగిపోయింది. అప్పటి దాకా సైడ్ హీరోయిన్ గా సాగిన ప్రభ కొన్ని చిత్రాలలో మెయిన్ హీరోయిన్ గానూ నటించారు. “దేవతలారా దీవించండి, జగన్మోహిని, ఆమెకథ, ఇంటింటి రామాయణం, ఇదెక్కడి న్యాయం, కోరికలే గుర్రాలయితే, పార్వతీ పరమేశ్వరులు, సంధ్యారాగం, నేను-మా ఆవిడ, సంతోషీమాత వ్రత మహాత్మ్యం, మనిషికో చరిత్ర, శ్రీవినాయక విజయం” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ‘ఇదెక్కడి న్యాయం’లో హరికథా భాగవతారిణిగా ప్రభ అభినయం ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రభపై చిత్రీకరించిన “వినుడీ జనులారా…” సాంగ్ లో ఆమె నటన జనాన్ని మురిపించింది.

యన్.టి.ఆర్, దాసరి, రాఘవేంద్రరావు వంటి దర్శకులు ప్రభను ఎంతగానో ప్రోత్సహించారు. యన్టీఆర్ ‘శ్రీమద్విరాట పర్వము’లో సత్యభామగా నటించారామె. అలాగే ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’లో వేమన ఎపిసోడ్ లో విశ్వదగానూ కనిపించారు. ఆ పై ‘సింహం నవ్వింది’లో యన్టీఆర్ సరసన ప్రత్యేక పాత్రలో నటించారు. ఇక ఏయన్నార్ సరసన ‘మహాత్ముడు’లో కీలక పాత్ర పోషించారామె. కృష్ణతో ‘కొల్లేటి కాపురం’లో నాయికగా నటించారు. తరువాతి రోజుల్లోనూ తన దరికి చేరిన పాత్రల్లో అలరించారు ప్రభ. ఆ మధ్య వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’లోనూ ప్రభ నటించారు. ఇప్పటికీ ఉత్సాహంగా నవతరం ప్రేక్షకులతో కలసి నటించాలని చూస్తున్నారామె. ప్రభ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.