(మార్చి 19న ‘సీతారత్నంగారి అబ్బాయి’కి 30 ఏళ్ళు)
కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్లను జనం భలేగా ఆదరిస్తారు. వినోద్ కుమార్, రోజా జంటను అప్పట్లో ప్రేక్షకులు మెచ్చారు. వారు నటించిన చిత్రాలను బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రూటులో సాగేలా చేశారు. అలా వారు నటించిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ చిత్రాన్ని విజయపథంలో పయనింప చేశారు. 1992 మార్చి 19న విడుదలైన ‘సీతారత్నంగారి అబ్బాయి’ మంచి విజయం సాధించి, వినోద్ కుమార్, రోజా జోడీకి మంచి పేరు సంపాదించి పెట్టింది.
ఈ సినిమా కథేమిటంటే- ఊరందరికీ మంచి చేసే సీతారత్నం తన భర్త ఎప్పుడో చేసిన తప్పుకు శిక్షగా అతనితో ఒకే ఇంట్లో ఉంటూనే వేర్వేరుగా జీవిస్తూ ఉంటారు. భర్త తాగుడుకు బానిసై ఉంటాడు. ఆ ఊరికి వంశీ అనే ఓ అబ్బాయి బ్యాంక్ మేనేజర్ గా వస్తాడు. అతనికి ఎక్కడా ఇల్లు దొరకదు. దాంతో సీతారత్నం ఇంట్లో అద్దెకు దిగుతాడు. సీతారత్నంకు బుల్లెబ్బాయ్ అనే ఓ అన్నయ్య అతనికి ఓ కొడుకు, ఓ కూతురు ఉంటారు. ఆ అమ్మాయి పేరు మంగ. ఆమెకు పెళ్ళి పిచ్చి. అసలే వంశీని చూడగానే మనసు పారేసుకుంటుంది. సీతారత్నం, వంశీని సొంత కొడుకులా చూసుకుంటూ ఉంటుంది. అందరూ అతణ్ణి సీతారత్నంగారి అబ్బాయి అనే అంటూ ఉంటారు. బుల్లెబ్బాయ్ కూడా వంశీతో మంగ పెళ్ళికి అంగీకరిస్తాడు. దాంతో వంశీ తన తల్లిని తీసుకు వస్తాడు. ఆమె సీతారత్నం మొగుడి మొదటి పెళ్ళాం. వంశీ తన కొడుకే అని తెలుసుకొని అతను మురిసిపోతాడు. కానీ, ఈ విషయాన్ని అటు ఆయన కానీ, వంశీ తల్లికానీ బయట పెట్టరు. మొదటి నుంచీ మంగ అన్నయ్యకు వంశీ అంటే గిట్టదు. అతను వంశీని తండ్రెవరో తెలియని వెధవ అంటాడు. ఆ తరువాత తన అత్త సీతారత్నంకు తెలిసివచ్చేలా ఓ నాటకం ఆడతాడు. అప్పుడు వంశీ, సీతారత్నం భర్తనే తన కన్నతండ్రి అని చెప్పడంతో ఆమె కుంగిపోతుంది. మంగ పెళ్ళి వేరే వాడితో చేసే ప్రయత్నంలో తాళి కట్టేటప్పుడు లేచి గుడిలో దాక్కుంటుంది. తన దగ్గరకు ఎవరూ రాకుండా వివస్త్ర అవుతుంది. వంశీ వచ్చి మంగకు బట్టలు కట్టి తీసుకు పోతాడు. అయితే సీతారత్నం తన భర్త మొదటి భార్య తన కోసమే భర్త ఎదురుగా ఉన్నా, చెప్పలేదని ఆమె భావిస్తుంది. అందరూ బాగుండాలని ఆశిస్తూ ఆమె ఉత్తరం రాసి మరణిస్తుంది. నా ఇంట్లో నా భర్త తన భార్యతోనూ, నా కొడుకు నా మేనకోడలుతో సుఖంగా కాపురం చేసుకోవాలనే ఇలా చేశానని ఉత్తరంలో రాసి ఉంటుంది. సీతారత్నంకు అందరూ కలసి అంత్యక్రియలు చేస్తారు. ఆమె చితికి వంశీ నిప్పు పెట్టడంతో కథ ముగుస్తుంది.
వినోద్ కుమార్, వాణిశ్రీ, రోజా, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూమోహన్, శ్రీకాంత్, నిర్మలమ్మ, మణిమాల, అనిత, వాసుకి, చిడతల అప్పారావు, ఆలీ, గరగ, జిత్ మోహన్ మిత్ర ముఖ్యపాత్రధారులు.
శ్రీవేంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కథను యూనిట్ స్వయంగా సమకూర్చుకుంది. యల్.బి.శ్రీరామ్ మాటలు రాశారు. రమణి-బాబూరావు రచనా సహకారం అందించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చగా, వేటూరి, సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు పలికించారు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు. ఇందులోని “మేఘమా మరువకే…”, “మత్తుగా గమ్మత్తుగా…”, “నా మొగుడే బ్రహ్మచారి…”, “ఆ పాపి కొండల్లో…”, “పసివాడో ఏమిటో ఆ పైవాడు…” పాటలు అలరించాయి. ‘సీతారత్నంగారి అబ్బాయి’ మంచి విజయం సాధించింది. జంధ్యాల అసోసియేట్ గా పనిచేయడం వల్ల ఇ.వి.వి. సత్యనారాయణ సైతం కథను నడిపిన తీరులో గురువును అనుసరించిన తీరు ఇట్టే తెలిసిపోతుంది.
