NTV Telugu Site icon

Trivikram Srinivas: సినిమా పాట కన్నా ఎత్తైన మనిషి సిరివెన్నెల

Trivikram

Trivikram

సిరివెన్నెల సీతారామారాశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. ఆయన పాటల పూదోటలో విహరించని మనిషి ఉండడు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సాహిత్యం ఎప్పుడూ మన మధ్యనే  ఉండేలా తానా ఒక గొప్ప నిర్ణయం తీసుకొంది. సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేందుకు తానా సంకల్పించింది. నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాదు శిల్పకళావేదికలో “సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి – 1” పుస్తకావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేశారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ “కవి పాడుతున్నప్పుడు అతని గొంతు కంటే అతని గుండె గొప్పగా ఉంటుంది.  ఇప్పటికీ సిరివెన్నెల గారి గొంతు గుర్తుంది.  సిరి వెన్నెల ఎన్నో గొప్ప పాటలు రాశారు. ఆయనతో నేను  గడిపిన సయమం చాలా విలువైనది. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. సినిమా పాట కన్నా ఎత్తైన మనిషి .. ఆ పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి.. అది మనకు అర్ధమైన దానికన్నా విస్తారమైన మనిషి.. అలాంటి మనిషితో  కొన్ని సంవత్సరాలు గడపడం ఆనందం.. ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవడం బాధాకరం. సిరివెన్నెల క్లయిమాక్స్ లేని ఒక చిత్రం.. చివరిపేజీ లేని ఒక పుస్తకం. కళ్లకు రంగు ఉంటుంది కానీ కన్నీళ్లకు కాదు.

నిశ్శబ్దంతో యుద్ధం చేసిన గొప్ప కవి సిరివెన్నెల.. ఆ కవి ఇప్పుడు లేడు .. వెళ్ళిపోయాడు. కానీ ఆయన అక్షరాలు మన మధ్యే తిరుగుతున్నాయి.  ఒక గొప్ప కవి తళుకు లక్షణం ఏంటంటే కాలాన్ని ఓడించడం.  ఎందుకంటే.. ధర్మం  కాలంతో మారుతోని కానీ సత్యం మారదు. కవి సత్యాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు సిలువను మోస్తున్నట్లు కవి ఎప్పుడూ సత్యాన్ని మోస్తూ ఉండాలి. నేను, ఆయన ఉన్నప్పుడు చాలాసార్లు వాదులాడుకున్నాం.. నాకు ఇప్పుడు అనిపిస్తోంది.. అదంతా ఆయన గొప్పతనం .. నా మీద ఆయన చూపించిన కరుణ.. నేనే ఒక సినిమాలో చెప్పినట్లు అద్భుతం జరిగినప్పుడు తెలియదు.. జరిగాక దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన ఒక అద్భుతం” అని చెప్పుకొచ్చారు.