‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ఇప్పుడు ‘హబీబ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ పాట ఆఫ్ఘన్ సాహిత్యంతో ఉండటం విశేషం. ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఈ మూవీ కథ గురించి నిర్మాతలు హబీబ్ సఫీ, కోటి రావ్ తెలుపుతూ, ”కొంత మంది చిన్నపిల్లలను ఇండియా నుంచి సరిహద్దు దాటించి పాకిస్థాన్ తీసుకెళ్లి ఉగ్రవాద చర్యలు చేయడానికి శిక్షణ ఇప్పిస్తుంటారు. అక్కడి నుంచి ఆ పిల్లలను ఆఫ్ఘనిస్థాన్‌కు పంపుతారు.అలా ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకున్న తన కొడుకుని వెతుక్కుంటూ ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కథే ‘హబీబ్’. చివరకు ఆఫ్ఘనిస్థాన్ సైన్యం, మరికొంత మంది సాధారణ ప్రజల సహకారంతో ఆర్మీ ఆఫీసర్ తన కొడుకుతో పాటు అక్కడున్న ఇతర పిల్లల ఆచూకీని కనిపెడతాడు. ఉగ్ర చెర నుంచి ఆ పిల్లల ప్రాణాలను కాపాడటమే కాదు.. వారికి స్వేచ్ఛను కలిగిస్తాడు మన ఆర్మీ ఆఫీసర్’’ అని అన్నారు.
దర్శకురాలు జెన్నీఫర్ అల్ఫోన్స్ మాట్లాడుతూ, ”నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇవాళ తీవ్రవాద సంస్థల కారణంగా చిన్నపిల్లల బాల్యం దోపిడీకి గురవుతోంది. అలాంటి నీచమైన పనిని అంతం చేయించాలనే ఉద్దేశంతో నిజాయతీగా చేస్తున్న చిన్న ప్రయత్నమిది” అని చెప్పారు. ఈ చిత్రానికి జయఫణి కృష్ణ సంగీతం అందిస్తున్నారు.
