టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మరో పది రోజులకు జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. అలా వచ్చీ రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్ అభిమానులను అలరించడం ఆరంభించింది.
ఈ ట్రైలర్ మహేశ్ బాబు డిఫరెంట్ విజువల్స్ తో “యూ కెన్ స్టీల్ మై లవ్… నా ప్రేమను దొంగలించగలవు…” అంటూ ఆయన వాయిస్ తో మొదలవుతుంది. “యూ కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్… నా స్నేహాన్నీ దొంగిలించగలవు…” అని తరువాత వినిపిస్తుంది. ఆపై “యూ కాంట్ స్టీల్ మై మనీ…” అన్న మాటలు చెవులకు సోకుతాయి. ఆ పై ఒకడిని ధనాధన్ అంటూ పీకేసి, “అమ్మాయిల్ని, అప్పిచ్చేవాణ్ణి ప్యాంపర్ చేయాల్రా… రఫ్ఫుగా హ్యాండిల్ చేయకూడదు…” అంటూ హితవూ పలుకుతూ కనిపిస్తారు మహేశ్. ఇక నాజూకు షోకులతో కీర్తి సురేశ్ సైతం కనువిందు చేస్తుంది. మధ్యలో వెన్నెల కిశోర్ కామెడీ కితకితలు పెడుతుంది. సముతిరఖని, నదియా, తనికెళ్ళ భరణి అలా ట్రైలర్ లో తళుక్కుమంటారు. రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్స్ పాటు సాగే ఈ ట్రైలర్ చూపరులను ఆకట్టుకుంటుంది. అభిమానులను మరింతగా మెప్పిస్తుంది. చూసినవారే చూసేలా చేస్తుంది.
ఈ చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి ఆర్.మాది సినిమాటోగ్రాఫర్ కాగా, థమన్ స్వరకల్పన చేశారు. మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ నిర్వహించారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా ‘సర్కారు వారి పాట’ సినిమా సందడి చేయనుంది. 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’తో జనాన్ని అలరించిన మహేశ్ బాబు దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలలకు ‘సర్కారువారి పాట’తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అందువల్ల ఈ ట్రైలర్ ను పదే పదే చూస్తోన్న ఫ్యాన్స్ సినిమాను కూడా అదే స్థాయిలో ఆదరిస్తారని అనిపిస్తోంది
