Site icon NTV Telugu

Saritha : సరితకు వరంగా మారిన స్వరం!

Sarithajpg

Sarithajpg

చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ఇక్కడ ఒకటి కావాలని వచ్చి, మరోటి అవుతూ ఉంటారు. ఒకలా ఓ సారి వెలుగులు విరజిమ్మి, మరోలా ఇంకోసారి తళుక్కుమనే వారికీ ఇక్కడ కొదువే లేదు. అలా వెలుగొందుతున్నవారిలో ఓ నాటి నటి, ఈ నాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గురించి తప్పకుండా చెప్పుకోవాలి. సరిత పలుకుతో ఈ నాటికీ మురిపిస్తున్న చిత్రాలెన్నో వస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సర్కారువారి పాట’లోనూ నదియాకు సరిత గళవిన్యాసాలు అలరించాయి.

సరిత పదహారణాల తెలుగమ్మాయి. ఆమె అసలు పేరు అభిలాష. 1963 జూన్ 7వ తేదీన గుంటూరులో జన్మించారు. నల్లగా ఉన్నా ఆకర్షణీయమైన రూపం సరిత సొంతం. అదే తమిళ దర్శకుడు కె.బాలచందర్ ను ఆకర్షించింది. ఆయన తన ‘మరోచరిత్ర’ ద్వారా సరితను తెరకు పరిచయం చేశారు. 1978లో జనం ముందు నిలచిన ‘మరోచరిత్ర’ తెలుగు సినిమాయే అయినా, మద్రాసులో 75 వారాలు ప్రదర్శితమై అప్పట్లో నిజంగానే ఓ చరిత్ర సృష్టించింది. బాలచందర్ దర్శకత్వం వహించిన “ఇది కథ కాదు, గుప్పెడు మనసు, తొలికోడి కూసింది, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, కోకిలమ్మ, 47 రోజులు” వంటి చిత్రాలలో సరిత కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

మురళీమోహన్ జోడీగా సరిత నటించిన “విజయ, గూటిలోని రామచిలక, రామదండు” వంటి సినిమాలూ అలరించాయి. చిరంజీవికి జోడీగా ‘శ్రీరస్తు-శుభమస్తు’లో నటించారామె. ఆ పై పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు సరిత. మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘అర్జున్’ లో సరిత లేడీ విలన్ గా నటించిన తీరును ఎవరూ మరచిపోలేరు. తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్లోనూ సరిత తనదైన బాణీ పలికించారు. మళయాళ నటుడు ముకేశ్ ను వివాహమాడారు. వారికి శ్రావణ్, తేజాస్ ఇద్దరు పిల్లలు. తనయుడు శ్రావణ్ వద్దనే సరిత ఉంటున్నారు.

తమిళ చిత్రాల ద్వారా ఉత్తమ నటిగా పలు అవార్డులు సంపాదించిన సరిత, మాతృభాష తెలుగులో మాత్రం బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం! ‘అమ్మోరు, మా ఆయన బంగారం, అంతఃపురం’ చిత్రాలలో నటి సౌందర్యకు డబ్బింగ్ చెప్పడం ద్వారా సరితకు ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా నంది అవార్డులు లభించాయి. ‘మావిచిగురు’తోనూ ఆమె బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నందిని సొంతం చేసుకున్నారు. ‘కోకిలమ్మ, అర్జున్’ సినిమాలతో నటిగా స్పెషల్ జ్యూరీ అవార్డులే దక్కించుకోగలిగారు.

నటిగా అవకాశాలు సన్నగిల్లక ముందే సరిత గాత్రం పలువురు నటీమణుల నటనకు దన్నుగా నిలచింది. సుజాత, సుహాసిని, మాధవి, సుధాచంద్రన్, భానుప్రియ, విజయశాంతి, రాధ, శరణ్య, నదియా, సౌందర్య, శోభన, అమల, నగ్మా, మధుబాల, మీనా, రమ్యకృష్ణ, రోజా, ఆమని, టబు, సిమ్రాన్ వంటి తారలకు పలు చిత్రాలలో సరిత గాత్రదానం చేశారు. నదియాకు హీరోయిన్ గా ఉన్నప్పుడూ డబ్బింగ్ చెప్పిన సరిత ఇప్పుడు తల్లి పాత్రలు వేస్తున్నా తన గళంతో అలరించడం విశేషం! సరిత గాత్రమే “అత్తారింటికి దారేది, దృశ్యం, దృశ్యం-2, అ ఆ, వరుడు కావలెను, సర్కారువారి పాట” చిత్రాలలో నదియా నటనకు ప్రాణం పోసింది. సరిత మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.

Exit mobile version