NTV Telugu Site icon

Santosham Movie: రెండు పదుల ‘సంతోషం’

Santosham 2 Years

Santosham 2 Years

అక్కినేని నాగార్జున తాను హీరోగా నటించిన చిత్రాల ద్వారా, తాను నిర్మించిన సినిమాల ద్వారా పరిచయం చేసిన పలువురు దర్శకులు చిత్రసీమలో రాణించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నాగార్జున హీరోగా డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించిన ‘సంతోషం’ చిత్రం ద్వారా దర్శకుడు దశరథ్ పరిచయం అయ్యారు. గ్రేసీ సింగ్, శ్రియ నాయికలుగా నటించిన ‘సంతోషం’ చిత్రం 2002 మే 9న విడుదలై మంచి విజయం సాధించింది.

‘సంతోషం’ కథలో ప్రేమతో పాటు, కుటుంబ విలువలూ మిళితమయ్యాయి. ధనవంతుడైన ఆర్కిటెక్ట్ కార్తిక్, పద్మావతి ప్రేమించుకుంటారు. వారి ప్రేమను పద్మావతి కజిన్ భాను కూడా ప్రోత్సహిస్తుంది. అయితే సంప్రదాయానికి, ఉమ్మడి కుటుంబానికి ఎంతో విలువనిచ్చే పద్మావతి తండ్రి రామచంద్రయ్య ఆమె ప్రేమను అంగీకరించడు. దాంతో కార్తిక్ ను పెళ్ళాడి పద్మావతి వెళ్ళిపోతుంది. న్యూజిలాండ్ లో కార్తిక్, పద్మావతి దంపతులు ఉంటారు. వారికి ఓ అబ్బాయి లక్కీ పుడతాడు. ఓ యాక్సిడెంట్ లో పద్మావతి మరణిస్తుంది. తన కొడుకు లక్కీకి తల్లి దూరమైనా, పద్మావతి సదా స్మరించిన ఆమె కన్నవారి ప్రేమ లభించాలని కార్తిక్ భావిస్తాడు. ఓ పెళ్ళి సందర్భంగా కార్తిక్ , లక్కీతో రామచంద్రయ్య ఇంటికి వెళతాడు. అక్కడ కార్తిక్ మంచితనం అందరికీ నచ్చుతుంది. రామచంద్రయ్య కూడా కార్తిక్ ను తన అల్లునిగా అంగీకరిస్తాడు. అదే సమయంలో భానును, ఆమెకు బావ వరసయ్యే పవన్ కు ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తారు. కానీ, కార్తిక్ మంచితనం నచ్చిన భాను అతణ్ణి ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన కార్తిక్ అది సరైన పద్ధతి కాదని చెబుతాడు. ఇప్పటికే తన ద్వారా రామచంద్రయ్య కుటుంబం పద్మావతికి దూరమయిందని, మరోసారి అలా జరగకూడదని కోరతాడు. కానీ, భాను మనసు అతని మాటలను అంగీకరించదు. భాను మనసులో తనకు స్థానం లేదని తెలుసుకున్న పవన్ కూడా కార్తిక్ తో ఆమెను పెళ్ళాడమని చెబుతాడు. రామచంద్రయ్య కూడా చివరకు భాను మనసు తెలుసుకొని, అంతలా అందరినీ ఆకట్టుకున్న కార్తిక్ కు ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.

నాగార్జున, కె.విశ్వనాథ్, ప్రభుదేవా, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, పృథ్వీరాజ్, ఆహుతి ప్రసాద్, బెనర్జీ, ప్రీతి నిగమ్, సుధ, తనికెళ్ళ భరణి, మెల్కోటే, ఎల్బీ శ్రీరామ్, సోఫియా హఖ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.గోపాల్ రెడ్డి సమర్పకులు. ఈ సినిమాకు ఆర్.పి. పట్నాయక్ స్వరపరచిన పాటలు భలేగా ఆకట్టుకున్నాయి. సీతారామశాస్త్రి, కులశేఖర్, విశ్వ పాటలు పలికించారు. “నువ్వంటే నాకిష్టమని…”, “ధీంతనట్కరి…”, “దేవుడే దిగివచ్చినా…”, “నే తొలిసారిగా…”, “మెహబూబా మెహబూబా…”, “ఏమైందో ఏమో నాలో…”, “డిరి డిరి డిరిడీ…” అంటూ మొదలయ్యే పాటలు అలరించాయి. దశరథ్ కథ సమకూర్చిన ఈ చిత్రానికి గోపీమోహన్, త్రివిక్రమ్ కూడా రచనలో పాలు పంచుకోవడం విశేషం!

‘సంతోషం’ చిత్రం గ్రాండ్ సక్సెస్ సాధించింది. అంతకు ముందు యన్టీఆర్ సినిమా టైటిల్ తో రూపొందిన నాగార్జున చిత్రం ‘నిన్నే పెళ్ళాడతా’ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. తరువాత మరో రామారావు టైటిల్ ‘ఎదురులేని మనిషి’లోనూ నాగ్ నటించి, సక్సెస్ చూశారు. యన్టీఆర్ టైటిల్ తో నాగార్జున విజయం చూసిన మూడో చిత్రంగా ‘సంతోషం’ నిలచింది. ఈ చిత్రం ద్వారా నాగార్జునకు ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. ఆ అవార్డును అదే యేడాది ‘ఇంద్ర’తో ఉత్తమనటునిగా నిలచిన చిరంజీవితో కలసి పంచుకోవడం విశేషం! అలా ఇద్దరు సూపర్ స్టార్స్ తెలుగునాట ఉత్తమ నటుడు కేటగిరీలో నంది అవార్డును పంచుకోవడం అదే మొదటి సారి, ఇప్పటి దాకా కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. ‘సంతోషం’ సినిమా విడుదలై ఒక్కో ఏరియాలో ఒక్కోలా టాక్ సంపాదించింది. పశ్చిమ గోదావరిలో ఈ సినిమాను విడుదల చేసిన సురేశ్ కొండేటికి అనూహ్యమైన లాభాలు వచ్చాయి. ఆ తరువాత సురేశ్ ఈ సినిమా పేరుతోనే ‘సంతోషం’ అనే సినిమా మేగజైన్ ఆరంభించి ఇప్పటికీ నడుపుతూ ఉండడం విశేషం!

‘సంతోషం’ చిత్రం ఇరవైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. నాగార్జున హిట్ మూవీస్ లో ఒకటిగా ‘సంతోషం’ స్థానం సంపాదించింది. శ్రియకు ఇది రెండో సినిమా కావడం గమనార్హం! ఈ చిత్రంలోనే నాగ్ సరసన శ్రియ తొలిసారి నటించింది. ఆ పై వారిద్దరూ జంటగా నటించిన ‘నేనున్నాను’ కూడా విజయం సాధించింది. ‘సంతోషం’ సక్సెస్ తో శ్రియ దక్షిణాది టాప్ స్టార్స్ అందరితోనూ నటించే ఛాన్స్ దక్కించుకుందని చెప్పవచ్చు.

Show comments