Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్‌ప్రైజ్!

Anta Ramuloru Chooskuntaru 300kb

Anta Ramuloru Chooskuntaru 300kb

Anta Ramuloru Chooskuntaru: యంగ్ హీరో సంగీత్ శోభన్, మాలీవుడ్ బ్యూటీ అనశ్వర రాజన్ తొలిసారి జంటగా కనిపించబోతున్న సినిమాకు ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే కొత్త టైటిల్, గ్లింబ్స్ తో సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.  ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ కాంబినేషన్‌తో బజ్ ఏర్పడింది.  ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను వినగానే గోదావరి యాస, అక్కడి పల్లెటూరి వాతావరణం, మనుషుల మధ్య ఉండే ఆప్యాయత గుర్తొచ్చేలా కనిపిస్తోంది. గ్లింబ్స్ ను చూస్తే ఒక ఫీల్ గుడ్ డ్రామాగా కనిపిస్తోంది.

అయితే ఇందులో ప్రధానంగా కనిపించబోయేది ప్రేమకథ కాదని చెబుతున్నారు. హీరో, హీరోయిన్ మధ్య జరిగే ఒక అందమైన కథ నడుస్తుందని తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఉండే బంధం ఎలా మొదలవుతుంది, ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది సినిమా చూసిన తర్వాతే పూర్తిగా అర్థమయ్యేలా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకోవడం సినిమాకు మరో ప్రత్యేకత. గోదావరి జిల్లాల పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల జీవనశైలి, మాట తీరు, సంబంధాలు, భావోద్వేగాలను తెరపై సహజంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఫీల్ గుడ్ కథలకు తన సంగీతంతో ప్రత్యేకమైన వాతావరణం తీసుకురావడంలో పేరున్న మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు అందించే పాటలు, నేపథ్య సంగీతం కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య సాగే కథకు మ్యూజిక్ మరింత అందాన్ని తీసుకొచ్చేలా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విజిబి ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని కలిసి నిర్మిస్తున్నారు. కథకు తగ్గట్టుగా మంచి నటీనటులను కూడా తీసుకున్నారు. రావు రమేష్, రోహిణి, రఘుబాబు, అలీ, ఝాన్సీ, వినోద్ కుమార్, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

సంగీత్ శోభన్ ఇప్పటికే తన సినిమాలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు అనశ్వర రాజన్ మలయాళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ కొత్త జోడీపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీలా కాకుండా భిన్నమైన కథతో వస్తున్నామని మేకర్స్ చెబుతుండటంతో సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మరింత పెరిగింది.

ఇప్పటివరకు సినిమా విడుదల తేదీని మాత్రం చిత్రబృందం ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘అంత రాములోరు చూస్కుంటారు’ నిజంగానే ప్రేమకథకు భిన్నమైన అనుభూతిని ఇస్తుందా? గోదావరి నేపథ్యంలో సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.