Sangeeth Prathap Injured in accident: ‘బ్రోమాన్స్’ సినిమా షూటింగ్‌లో భాగంగా గత శనివారం ఉదయం కొచ్చి ఎంజీ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో నటులు రోమాంచం ఫేమ్ అర్జున్ అశోకన్, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్ గాయపడ్డారు. సినిమాలో ఛేజ్ సీన్ షూట్ చేస్తుండగా మితిమీరిన వేగంతో వచ్చిన కారు మరో కారును ఢీకొని బోల్తా పడింది. వాహనంలో ఉన్న అర్జున్, సంగీత్‌లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సంగీత్ మెడకు గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే షూటింగ్‌లో కారు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. వాహనం అతివేగంగా నడుపుతున్నట్లు తేలిన క్రమంలో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కొచ్చి ఎంజీ రోడ్డులో అనుమతి లేకుండా షూటింగ్ జరుపుతున్న సమయంలో కారు బైక్ ను ఢీకొని బోల్తా పడడంతో సంగీత్ సహా ఐదుగురు గాయపడ్డారు.
ఈ ఘటనపై మోటారు వాహన శాఖ కూడా విచారణ జరుపుతోంది. ఈరోజు నివేదిక సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఓ స్టంట్ మాస్టర్ కారు నడుపుతున్నాడు. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ముందున్న కారును ఢీకొట్టడంతో ఈ కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ బైక్‌ను ఢీకొట్టింది. ఇక ప్రస్తుతం సంగీత్ తన ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. మేమంతా క్షేమంగా ఉన్నాము, నేను 24 గంటలు ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నా, చిన్న గాయం ఉంది, కానీ నేను కోలుకుంటున్నాను. డ్రైవర్‌పై నేను కేసు నమోదు చేశానని కొన్ని పుకార్లు వచ్చాయి, నా వైపు నుండి అలాంటి చర్యలు తీసుకోలేదు. అలాంటి అవాస్తవ వార్తలను ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, త్వరలో నాకు ఇష్టమైన షూటింగ్ సెట్‌లకు తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అని అంటూ రాసుకొచ్చాడు.