Sandeepa Virk: సినిమాల్లో కనిపించే సెలబ్రిటీ జీవితం బయటికి ఎంత అందంగా కనిపించినా.. కొన్ని పరిస్థితులు ఎదురైతే అదే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. పంజాబీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ విషయంలోనూ ఇదే జరిగింది. సుమారు రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై నాలుగు నెలలకు పైగా తిహార్ జైలులో గడిపిన ఆమె.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన జైలు అనుభవాలను పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. జైలుకు తీసుకెళ్లే ముందు జరిగిన మెడికల్ ప్రాసెస్ నుంచి అక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల వరకు ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తనను అరెస్టు చేసిన తర్వాత మొదట ఆసుపత్రికి తీసుకెళ్లారని సందీపా తెలిపారు. అక్కడ మహిళలకు సాధారణంగా చేసే మెడికల్ ప్రాసెస్‌లో భాగంగా తనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని చెప్పారు. అయితే ఆ సమయంలో ఎదురైన పరిస్థితులు తనకు చాలా అవమానకరంగా అనిపించాయని ఆమె పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ మురికి టాయిలెట్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన తీరు తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. ఇక కోర్టు విచారణల కోసం జైలు నుండి బయటకు వెళ్లేటప్పుడు, తిరిగి లోపలికి వచ్చేటప్పుడు భద్రత పేరుతో మహిళా పోలీసులు తనను దారుణంగా అవమానించేవారని ఆమె పేర్కొన్నారు. జైలులో ఉన్న కాలంలో తనను దాదాపు 27 నుండి 30 సార్లు బట్టలు లేకుండా నిలబెట్టి తనిఖీలు చేశారని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక చిన్న బ్యారక్‌లో దాదాపు 500 మంది ఖైదీలతో కలిసి ఇరుకైన ప్రదేశంలో నేలపైనే పడుకోవాల్సి వచ్చేదని ఆమె చెప్పారు. జైలులోని బాత్‌రూమ్‌లు విపరీతమైన అపరిశుభ్రతతో ఉండేవని, ప్రతిరోజూ ఒకే రకమైన పప్పు, అన్నం, చపాతీలు ఇస్తూ దారుణమైన ఆహారాన్ని పెట్టేవారని తెలిపారు. అక్కడి సిబ్బంది వేధింపుల వల్ల తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కనీసం ఎవరి సహాయం లేకుండా నిలబడలేని స్థితికి చేరుకున్నానని ఆమె అన్నారు. ఆ నరకం చూడలేక, ఒక దశలో తాను చనిపోవాలని దేవుడిని ప్రార్థించానని ఆమె వెల్లడించారు. జైలులో ఉండగా తల్లిదండ్రులు తనను కలవడానికి రావడం చూసినప్పుడు మరింత బాధ కలిగేదని, వారి పరిస్థితి చూసి తాను కన్నీళ్లు పెట్టుకునేదాన్నని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఏడుపు వస్తుందని ఆమె తెలిపారు.
ఇదిలా ఉంటే.. సందీపా విర్క్‌పై ఉన్న కేసు సుమారు రూ.6 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించినది. పెట్టుబడి పేరుతో ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న కేసులో ఆ నగదు ఆమె ఖాతాల ద్వారా వెళ్లినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అమిత్ గుప్తా పరారీలో ఉండటంతో పాటు, విచారణ ముందుకు సాగడానికి సమయం పడుతుందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు 2025 డిసెంబర్‌లో సందీపాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సందీపా విర్క్ ఖండిస్తున్నారు. తాను తప్పు చేయలేదని, తనను ఈ కేసులో ఇరికించారని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఆ కేసు చట్టపరమైన ప్రక్రియలో ఉండగా.. సందీపా చెప్పిన జైలు అనుభవాలు మాత్రం బాలీవుడ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

