Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?

Samantha Ruth Prabhu1

Samantha Ruth Prabhu1

Samantha Ruth Prabhu : కొంతకాలం విరామం తర్వాత సమంత మళ్లీ వెండితెరపైకి అడుగుపెడుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సమంత చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా ఒక అభిమాని సినిమా గురించి ప్రశ్నించగా, సమంత ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను ఈ కథను ఎంపిక చేసుకోలేదని, ఈ కథే తనను ఎంపిక చేసుకుందని చెప్పారు. మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో తమ ‘త్రాలాల’ బ్యానర్‌ను ప్రారంభించినట్లు వివరించారు. అదే ఆలోచనలో భాగంగా మొదట ఈ కథను సాయి పల్లవికి వినిపించాలని భావించామని తెలిపారు. అయితే సాయి పల్లవి అప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో అది సాధ్యపడలేదని చెప్పారు.

ఆ తర్వాత నిర్మాతలు, రచయితలు కథలో కొన్ని మార్పులు చేసి తనకు అనుగుణంగా రూపొందించారని సమంత వెల్లడించారు. ‘మా ఇంటి బంగారం’ మంచి విజయాన్ని సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ సాయి పల్లవిని ట్యాగ్ చేసిన సమంత, భవిష్యత్తులో తన నిర్మాణ సంస్థలో రూపొందించే ఏదో ఒక ప్రాజెక్ట్‌లో ఆమెతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఇద్దరు ప్రముఖ నటీమణులు ఒకే ప్రాజెక్ట్‌లో కనిపించే అవకాశాలపై అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, జూన్ 19, 2026న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల పుకార్లు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమంత స్పష్టం చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా జూన్ 19నే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.

×
×
Ad

‘మా ఇంటి బంగారం’ చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాణ బాధ్యతల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరుతో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలె ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, గౌతమి తడిమల్ల, శ్రీముఖి, మంజుష, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించగా, ఛాయాగ్రహణ బాధ్యతలను ఓం ప్రకాష్ నిర్వహించారు. రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి కలిసి కథ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, ప్రహాస్ బొప్పూడి అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేశారు. మరోవైపు సమంత త్వరలో ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ వెబ్ సిరీస్‌తో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించగా, రాహి అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’తో పాటు ఈ ప్రాజెక్ట్ కూడా సమంత అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.