Site icon NTV Telugu

Samantha: సమంత మళ్లీ ఆసుపత్రిపాలు.. అప్డేట్ ఇచ్చిన మేనేజర్

Samantha Health Condition

Samantha Health Condition

Samantha Manager Gives Clarity On Her Health Condition: తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డానని, అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడించిన విషయం తెలిసిందే! అప్పట్నుంచి సమంత ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఎందుకంటే.. అది పూర్తిగా నయమయ్యే వ్యాధి కాదు. దానికి తరచుగా చికిత్స తీసుకుంటూనే ఉండాలి. సమయానుసారంగా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా.. తాను ఈ వ్యాధితో పోరాడి, ఆరోగ్యంగా తిరిగొస్తానని సమంత ఆవేదనతో చెప్పడాన్ని బట్టి చూస్తే, ఈ వ్యాధితో ఆమె ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, యశోద ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత కాస్త జోష్‌తోనే కనిపించింది.

అయితే.. ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. మయోసైటిస్ కారణంగా సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, దీంతో ఆమె చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిందన్నదే ఆ వార్త సారాంశం. తమిళనాడులో ఈ వార్త తెగ చక్కర్లు కొట్టింది. రెండు, మూడు రోజుల నుంచి సమంత కూడా యాక్టివ్‌గా కనిపించకపోయేసరికి, ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు. సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేయడం కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఆందోళన దూరమయ్యేలా, సమంత మేనేజర్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. సమంత ఆరోగ్యం క్షీణించినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఆమె ఏ ఆసుపత్రిలోనూ చేరలేదని స్పష్టం చేశాడు. సమంత చాలా ఆరోగ్యంగానే ఉందని, మునుపటిలాగే ఫుల్ జోష్‌తో జిమ్‌కి వెళ్లి కసరత్తులు సైతం చేస్తోందని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు.

శ్రీదేవి శ్రీధర్ అనే సినిమా జర్నలిస్ట్ కూడా సమంత ఆరోగ్యంగానే ఉందని ట్విటర్ మాధ్యమంగా కన్ఫమ్ చేశారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తను ఆరోగ్యంగానే ఉందని, ఫుల్ జోష్‌తో ఆడిపాడుతోందని ఆమె సన్నిహితులు తెలియజేసినట్లు పేర్కొంది. తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దని వెల్లడించారు. కాబట్టి.. సమంత ఆరోగ్యంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Exit mobile version