స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తరువాత ఏమవుతుంది? అదే ఉత్కంఠతో ఉన్నారు ప్రేక్షకులు. ఆ ఉత్కంఠ కన్నా మిన్నయైన ఆసక్తి కలిగించే అంశం మరోటి వెలుగు చూసింది. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరొందిన సుకుమార్ ‘పుష్ప’ మొదటి భాగంలో టాప్ హీరోయిన్ సమంతతోనే ఐటమ్ చేయించి కనువిందు చేశారు. “ఊ అంటావా… మావా…” అంటూ సాగే ఈ పాట అలా వచ్చీ రాగానే 100 మిలియన్ వ్యూస్ పట్టేసింది. ఇప్పటి దాకా ఆ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఆ లెక్క ఇంకా కొనసాగుతూనే ఉంది. అదే తీరున ‘పుష్ప’ రెండో భాగంలోనూ మరో ఐటమ్ సాంగ్ తెరకెక్కనుందట! అదే ఇప్పుడు అమితాసక్తి కలిగించే విషయమయింది. ఎందుకంటే, ‘పుష్ప’ రెండో భాగంలోనూ ఐటమ్ సాంగ్ లో సమంతనే అల్లు అర్జున్ తో చిందేయనుందట!
ఇప్పుడేమంటారు? సినిమాలో పోలీస్ ఇన్ స్పెక్టర్ , పుష్పపై ఎలా పగ పగబడతాడు. దానిని పుష్ప ఎలా ఎదుర్కొంటాడు అన్న అంశాల కంటే మరోమారు ‘పుష్ప’ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్, సమంతతో చిందేయడం విశేషమే కదా! పైగా మొదటి భాగంలో సమంత, అల్లు అర్జున్ మధ్య “ఊ అంటావా…మావా…” పాటలో సాగిన కెమిస్ట్రీ ఊహించుకుంటే, గిలిగింతలు పెట్టకుండా ఉంటాయా? అందువల్ల ‘పుష్ప – ద రూల్’లో పుష్ప, అతని ప్రత్యర్థుల మధ్య సాగే గొడవల కంటే, ఈ సారి సమంత, బన్నీపై తెరకెక్కే ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుంది? ఆ పాట ఏ రేంజ్ లో అలరిస్తుంది. ఈ సారి ఎలాంటి స్టెప్స్ తో సమంత, అల్లు అర్జున్ కనువిందు చేయబోతున్నారు అన్న అంశాలే ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. మరి ఈ సంగతి తెలిశాక ‘పుష్ప’ సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోదా ఏంటి?
