ఈవారం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా అలరించబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్2’ తర్వాత భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఇది. అప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల దర్శకత్వం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ‘ఆచార్య’కు పోటీగా ఏ సినిమాను విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు. అయితే తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ మాత్రం ‘ఆచార్య’కు ముందు ఒక రోజు విడుదల కాబోతోంది. దక్షిణాదిన టాప్ హీరయిన్స్ అయిన నయనతార, సమంత కలసి నటించిన సినిమా ఇది. దీనిని నయన్ బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశారు. అటు తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ ఇమేజ్ ఉన్న విజయ్ సేతుపతి ఇందులో హీరో. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాకు తమిళ నాట ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ తెలుగులో మాత్రం ‘ఆచార్య’ రూపంలో పెద్ద పర్వతం అడ్డంగా నిలబడి ఉండటం గమనార్హం. ఇక ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారం జరగక పోవడం కూడా అతి పెద్ద మైనస్. ట్రైలర్ ఎంత బాగా ఉన్నప్పటికీ మరో రెండు రోజుల్లో రానున్న ఈ సినిమా ఆడియన్స్ కి ఎంత వరకూ రీచ్ అయిందన్నది డౌటే. ఇక ఈ సినిమా తెలుగు టైటిల్ ‘కెఆర్ కె’ కూడా బాగా మైనస్ అయ్యే అంశం. సమంత, నయన్, విజయ్ సేతుపతి మ్యాజిక్ ఎంత వరకూ పని చేస్తుంది? ఈ రెండు రోజుల్లో వారు సినిమాకు ఎలాంటి ప్రచారం చేసి హైప్ తెస్తారో చూడాలి.
