బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తరచూ సెట్స్‌లో తన యాసతో, సరదా చేష్టలతో టీమ్‌ను నవ్విస్తూ ఉంటారు. కానీ కొన్ని సరదాలు కొంచెం ఘోరంగా మారే అవకాశం కూడా ఉంది. అలాంటి ఒక ఆసక్తికర సంఘటన గురించి తాజాగా నటి ఇందిరా కృష్ణన్ వెల్లడించారు. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాలో నటిస్తున్న ఆమె, 2003లో సల్మాన్‌తో చేసిన సినిమా ‘తేరే నామ్’ షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఓ ఆసక్తికర సంఘటన పంచుకున్నారు.
Also Read : Kelly Mc death : హాలీవుడ్ నటి కెల్లీ మాక్ కన్నుమూత..
ఒక సన్నివేశంలో సల్మాన్‌కి చెంపదెబ్బ కొట్టాల్సి రాగా… అందులో నిజంగానే కొట్టడం అంటే అంత ఈజీ కాదు కదా. ఇక్కడ ఇందిరా విషయంలో కూడా అదే జరిగింది. షూట్‌కు ముందు “నువ్వు నన్ను కొడితే, ఏదైనా జరగొచ్చు. చూసుకో!” అంటూ సల్మాన్ తనదైన స్టైల్లో హెచ్చరించారట. దీనితో ఇందిరాకి ఒకింత భయం వేయడం మొదలైంది. అంతటితో ఆగలేదు, తన బాడీగార్డ్‌ను కూడా ఆటలోకి దింపి, నటిని మరింత భయపెట్టారు సల్మాన్. “మీడియా వాళ్ళు వచ్చారు మేడం.. మీరు వెళ్లిపోండి.. మీరు భాయ్‌ని కొట్టారు కాబట్టి ఈ సంఘటన పెద్దదవుతుంది” అని బాడీగార్డ్ చెబుతుండగా నిజంగానే మీడియా గుంపు అక్కడ ఉండడంతో, ఇందిరా భయంతో కన్నీళ్ళు పెట్టుకుందట. దాదాపు ఒక గంట పాటు ఈ డ్రామా నడిచాక, చివరకు సల్మాన్ వచ్చి, ఇది కేవలం సరదా ఆట మాత్రమేనని చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారట. ప్రజంట్ ఆమె మాటలు వైరల్ అవుతుండటంతో సల్మాన్ ఫ్యాన్స్ హస్యం వ్యక్తం చేస్తున్నారు.
