Salman Khan Remuneration For GodFather Movie: బాలీవుడ్‌లో తాను చేసే సినిమాలకు కండలవీరుడు సల్మాన్ ఖాన్ కోట్లలో పారితోషికం తీసుకుంటాడు. సరైన ఫిగర్ ఎంతో తెలీదు కానీ.. రూ. 50 కోట్ల పైనే ఉండొచ్చని సమాచారం. అలాంటి సల్లూ భాయ్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ‘గాడ్‌ఫాదర్’లో ఓ అతిథి పాత్ర పోషించాడు. మరి, ఈ చిత్రానికి ఎంత పారితోషికం తీసుకొని ఉంటాడు? ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే.. ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘‘గాడ్‌ఫాదర్ పారితోషికం విషయమై సల్మాన్ ఖాన్‌తో మాట్లాడేందుకు నిర్మాతలు వెళ్లినప్పుడు.. ‘చిరంజీవి, రామ్ చరణ్‌లపై నాకున్న ప్రేమను మీరు డబ్బుతో కొనలేరు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ రియాక్ట్ అయ్యాడు. నిజంగా అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని చిరు చెప్పారు. తనకు, సల్మాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం మాటల్లో వర్ణించలేనదని.. రానురాను తమ మధ్య అనుబంధం మరింత బలపడుతూ వస్తోందని ఆయనన్నారు. ఇదే సమయంలో.. కనీసం స్టోరీ కూడా వినకుండా తాను అడగ్గానే ఈ సినిమా చేసేందుకు సల్మాన్ ఒప్పుకున్నాడన్నారు. ఇదో చిన్న పాత్ర అని, గౌరవప్రదంగానే ఉంటుందని, కావాలంటే ఓసారి లూసిఫర్ చూడొచ్చని తాను సల్మాన్‌తో చెప్పినప్పుడు.. ‘అవేమీ వద్దు, నేను ఈ సినిమా చేస్తున్నా అంతే’ అంటూ సల్లూ భాయ్ బదులిచ్చాడన్నాడు. తన పాత్రను నరేట్ చేయడానికి కేవలం ఒక్క మనిషిని పంపమని అడిగాడని చిరు తెలిపారు.
కాగా.. మలయాళంలో మంచి విజయం సాధించిన లూసిఫర్‌కి గాడ్‌ఫాదర్ రీమేక్. మాతృకను దెబ్బతీయకుండా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ సినిమాని రూపొందించారు. మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి, విబేక్ ఓబెరాయ్ పాత్రలో సత్యదేవ్, మంజూ వార్యర్ పాత్రలో నయనతార నటించగా.. పృథ్వీరాజ్ చేసిన కీలక పాత్రను సల్మాన్ ఖాన్ పోషించాడు. ఇంకా ఇతర ప్రముఖ నటీనటులు నటించిన ఈ సినిమా.. అక్టోబర్ 5వ తేదీన భారీఎత్తున రిలీజ్ కాబోతోంది.