Sai Pallavi: “అరె… మన సాయిపల్లవికి ఏమైంది?… ఈ మధ్య ఆమె సినిమాలేవీ కనిపించడం లేదు…” అంటూ నటి, నర్తకి సాయిపల్లవి అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజమే, తెలుగులో ‘విరాటపర్వం’ తరువాత సాయిపల్లవి కనిపించలేదు. తమిళ చిత్రం ‘గార్గి’ సాయి పల్లవి తెరపై కనిపించిన చివరి చిత్రం. గత సంవత్సరం జూలై 15న ‘గార్గి’ తెలుగులోనూ అనువాదరూపంలో వెలుగు చూసింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా మరో సినిమాలో సాయిపల్లవి కనిపించక పోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తోంది. సక్సెస్ వచ్చింది కదా అని సంబరాలు చేసుకోలేదు సాయిపల్లవి. అలాగని దరి చేరిన ప్రతీ పాత్రలోకి చొరబడలేదు. తన మనసుకు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తూ సాగిందామె. బహుశా, అందువల్లేనేమో సాయి పల్లవి ‘విరాటపర్వం, గార్గి’ చిత్రాలయ్యాక వెంటనే ఏ చిత్రమూ అంగీకరించలేదు. సోనీ పిక్చర్స్ తో కమల్ హాసన్ కలసి నిర్మిస్తున్న ఓ చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది.
సాయి పల్లవి నృత్యం ఎందరినో అలరించింది. స్వతహాగా నర్తకుడైన కమల్ హాసన్ కూ ఆమెలోని నాట్యకోణమే ఆకర్షించి ఉండవచ్చు. రాబోయే చిత్రంలో సాయిపల్లవి పాత్ర ఎలా ఉన్నా, ఆమె కోసమే కొందరు కథలు తయారు చేసుకొని తిరుగుతున్నవారు తెలుగు సినిమా సర్కిల్స్ కనిపిస్తూ ఉన్నారు. మరి వారికి ఎప్పుడు సాయి పల్లవి డేట్స్ లభిస్తాయో?
సాయిపల్లవి 1992 మే 9న తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరిలో జన్మిచింది. కొయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సాయి పల్లవి విద్యాభ్యాసం సాగింది. సాయి పల్లవి ఎక్కడా నాట్యశిక్షణ తీసుకున్నది లేదు. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఎంతో ఇష్టం. తన చెవులకు సోకిన సంగీతానికి అనువుగా ఆమె అడుగులు కలిపేది. అదే చూపరులను ఎంతగానో ఆకట్టుకొనేది. ఆ పై సినిమా పాటలను చూస్తూ, వాటిలోని డాన్స్ ను అనుకరించింది. తరువాత అవే బాణీలకు తాను సొంతగా ఎలా డాన్స్ చేస్తానో చూపించేది. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఓ వైపు తన చదువునూ కొనసాగించింది. జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు చదివింది. ఈ యూనివర్సిటీకి మన దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. 2016లోనే ఆమె డాక్టర్ పట్టా పొందాలి. అయితే డాన్స్, సినిమా కెరీర్ కారణంగా సరైన సమయంలో డాక్టర్ అనిపించుకోలేక పోయింది. అయితే 2020 ఆగస్టు 31న ట్రిచీలో ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్’ రాసింది. మెడిసిన్ లో పై చదువులు కొనసాగించాలని ఉన్నా, ఆమె నటనావృత్తి అందుకు అడ్డంకి అనే చెప్పాలి.
Read Also: Junior Panchayat Secretaries : జేపీఎస్‌లపై తెలంగాణ సర్కార్ సీరియస్.. విధుల్లో చేరకుంటే అంతే..
2009లో ఈటీవీ నిర్వహించిన ‘ఢీ’ కార్యక్రమంలో తన డాన్సుల ద్వారా ఫైనలిస్ట్ గానూ నిలిచింది సాయిపల్లవి. ఇక నటన విషయానికి వస్తే, చిన్నతనం నుంచీ ఎంతో చురుగ్గా ఉన్న సాయిపల్లవిని 2005లో మళయాళం దర్శకుడు ఎ.కె.లోహిత్ దాస్ తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కస్తూరి మాన్’లో నటింప చేశారు. 2008లో జయం రవి హీరోగా రూపొందిన ‘ధామ్ ధూమ్’లోనూ నటించింది సాయిపల్లవి. 2014లో మళయాళ చిత్రం ‘ప్రేమమ్’లో నాయికగా నటించి మురిపించిందామె. ఆ తరువాత నుంచీ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ ముందుకు సాగింది. 2017లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది సాయిపల్లవి. ఆ సినిమాలో భానుమతి పాత్రలో భలేగా అలరించిందామె. అప్పటి నుంచీ సాయి పల్లవి తెలుగు చిత్రాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది.
నాని హీరోగా రూపొందిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రంలో సాయి పల్లవి డాన్స్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ పై “కణం, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం” చిత్రాల్లోనూ సాయిపల్లవి తనదైన అభినయంతో ఆకట్టుకుంది. ఓ వైపు తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన తెలుగు చిత్రసీమలోనూ సాయిపల్లవి సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఆమె నటించిన అనువాద చిత్రాలు సైతం తెలుగువారిని అలరిస్తున్నాయి. మళ్ళీ ఏ సినిమాతో సాయిపల్లవి ప్రేక్షకులను ముందుగా మురిపిస్తుందో చూడాలి.
Read Also: Priyadarshi : ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న ప్రియదర్శి