Sahil Khan Fled over 1800 KMs in 40 Hours to avoid Arrest: మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ప్రాంతంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ నెట్‌వర్క్, దానికి సంబంధించిన అక్రమ బెట్టింగ్ యాప్‌లు, నెట్‌వర్క్‌లకు సంబంధించిన దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ సిట్ అతన్ని అరెస్టు చేసింది. పోలీసులు నాటకీయంగా అతనిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 40 గంటల పాటు సాగిన ఛేజింగ్ తో సాహిల్‌ను అరెస్టు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ మారుస్తూ వచ్చాడు. నిజానికి ఈ కేసులో నటుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు, కానీ అతని బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది.
Love Guru OTT: ఓటీటీలోకి రాబోతున్న విజయ్ ఆంటోనీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏప్రిల్ 25న, కోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే, అతను తన డ్రైవర్‌కు ఫోన్ చేసి అతని సాయంతో ముంబై నుండి తప్పించుకున్నాడు. అతని మొదటి స్టాప్ గోవాలో. అక్కడ కొన్ని గంటలు గడిపి, ఆపై కర్ణాటకకు బయలుదేరాడు. ఇంతలో అతను ఫోన్ ఎత్తడం లేదని అధికారులు గుర్తించారు. కర్నాటక హుబ్లీలో కొన్ని గంటలు గడిపిన సాహిల్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తెలంగాణలో హైదరాబాద్ కూడా వచ్చాడు. అక్కడ రూమ్ బుక్ చేసుకున్న అతను అవసరమైనప్పుడు మాత్రమే తన ఫోన్ స్విచ్ ఆన్ చేస్తున్నాడు. అయితే ఇంతలో, ముంబై క్రైమ్ బ్రాంచ్ అతని డ్రైవర్ వివరాలను సేకరించడంలో విజయవంతమైంది, అతని మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయడం ప్రారంభించింది.
ఇక పోలీసులు తన వద్దకు ఎప్పుడైనా చేరుకోవచ్చని గ్రహించిన సాహిల్ హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్లాడు. అదే సమయంలో, అతను గడ్చిరోలి జిల్లా అలాగే అనేక నక్సల్ ప్రభావిత జిల్లాల సరిహద్దు గుండా కూడా వెళ్ళాడు. దట్టమైన అడవి, రాత్రి చీకటి – నక్సలైట్ల భయంతో, డ్రైవర్ కూడా ముందుకు వెళ్లడానికి నిరాకరించాడు, దీంతో సాహిల్ అతనిపై ఒత్తిడి తెచ్చాడు. చివరకు జగదల్‌పూర్‌లో ఆగి ఆరాధ్య హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలో హ్యూమన్ అండ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపు తట్టారు. ఈ ఛేజింగ్ సమయంలో సాహిల్ తన ముఖాన్ని దాచుకోవడానికి మాస్క్, చిన్న టవల్‌ని వాడాడు. అరెస్టు అనంతరం తిరిగి ముంబైకి తీసుకువెళతామని, మహదేవ్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. 1800 కిలోమీటర్ల సుదీర్ఘ ఛేజింగ్ ఎట్టకేలకు ఇక్కడ ముగిసింది.