మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’కి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. గతేడాదిలో సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘గాడ్ ఫాదర్’ను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట! లాంగ్ వీకెండ్ కలిసొస్తుందన్న ఉద్దేశంతో, మేకర్స్ ఆ తేదీకే ఫిక్స్ అవ్వాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం సల్మాన్ – చిరులపై ఓ పాటని మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇది అభిమానుల్ని ప్రత్యేకంగా అలరించనుందని సమాచారం. నయనతార, సత్య దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
మరోవైపు.. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ‘భోళా శంకర్’తో పాటు బాబీ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రీకరణలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఏకకాలంలో చిరు ఈ మూడు సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ‘ఆచార్య’తో డిజాస్టర్ చవిచూసిన చిరు, ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది.
