Ruhani Sharma: సుశాంత్ హీరోగా నటించిన ‘చి.ల.సౌ.’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. ఆ తర్వాత ‘హిట్’ మూవీతో మరో హిట్ ను తన కిట్ లో వేసుకుంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలు, వెబ్ సీరిస్ లపై ఆసక్తి కనబరిచే రుహానీ శర్మ ఇటీవల నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన ఆంథాలజీ ‘మీట్ క్యూట్’లోనూ నటించింది. తాజాగా రుహానీ శర్మ ‘హర్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది. శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను డబుల్ అప్ మీడియాస్ బ్యానర్ లో రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే… దీనికి కొనసాగింపు కూడా ఉంటుందనే విషయం అర్థమౌతోంది. ‘హర్’ అనే టైటిల్ కిందనే చాప్టర్ 1 అనే విషయాన్ని ప్రముఖంగా పెట్టారు. రుహానీ శర్మతో పాటు ఇతర ప్రధాన పాత్రలను వికాశ్ వశిష్ఠ, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిజ్ఞయ, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ తదితరులు పోషిస్తున్నారు. దీనికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ స్వర రచన చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కానుంది.