దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ ఉత్తరాదిన అప్రతిహతంగా దూసుకుపోతోంది. ‘బాహుబలి -2’ రికార్డులను అక్కడ తిరగరాయకపోయినా, తనదైన ముద్రను వేస్తోంది. తాజాగా సెకండ్ వీకెండ్ గ్రాస్ లో ఈ సినిమా సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, అజయ్ దేవ్ గన్ ‘తానాజీ’ చిత్రాలను క్రాస్ చేసి ఏడవ స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఐదు భాషలలో మార్చి 25న విడుదలైన ఈ సినిమా హిందీ వర్షన్ సెకండ్ వీకెండ్ లో రూ. 52 కోట్లను వసూలు చేసింది. దీనికి ముందు అగ్రస్థానంలో ‘బాహుబలి -2’ రూ. 80.75 కోట్లు, ద్వితీయ స్థానంలో ‘దంగల్’ రూ. 73.70 కోట్లు, తృతీయ స్థానంలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ రూ. 70.15 కోట్లు చొప్పున రెండో వారాంతంలో వసూలు చేశాయి.
వాటి తర్వాత నాలుగు, ఐదు, ఆరు స్థానాలను ‘సంజు’ రూ. 63.15 కోట్లు, ‘బజరంగీ భాయిజాన్’ రూ. 56.10 కోట్లు, ‘పీకే’ రూ. 53.49 కోట్లు వసూళ్ళు సాధించి దక్కించుకున్నాయి. తాజాగా ఏడో స్థానం ‘ట్రిపుల్ ఆర్’ పొందింది. దానికి క్రింద చివరి మూడు స్థానాల్లో ‘టైగర్ జిందా హై’ రూ. 48.71 కోట్లు, ‘తానాజీ’ రూ. 48.54 కోట్లు, ‘కబీర్ సింగ్’ రూ. 47.15 కోట్లుతో నిలిచాయి. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వారం ‘ఎటాక్ -1’ విడుదలైనా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం దీనికి కలిసొచ్చింది. ఇప్పటికే ఉత్తరాదిన ‘ట్రిపుల్ ఆర్’ రూ. 184.59 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని, త్వరలోనే రూ. 200 కోట్ల మార్క్ ను దాటుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
