కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. అలా ఒక్కోసారి ఊహించని కష్టాలు సినిమా వాళ్ళకూ వస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె సోకాల్డ్ బోయ్ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం మేరకు వీరు నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థపై సోషల్ యాక్టివిస్ట్ కన్నన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. సంస్థ పేరులోని రౌడీ అనే పదాన్ని తొలగించాలని, అలాంటి అభ్యంతరకరమైన పేరు పెట్టినందుకు నయనతార, విఘ్నేష్ లను అరెస్ట్ చేసి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతను మెట్రోపాలిటన్ పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
అయితే మరి కొందరి కథనం ఇంకో విధంగా ఉంది. ఇటీవలే అజిత్ తన 62వ సినిమాను విఘ్నేష్ శివన్ తో చేయబోతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సందర్భంగా విఘ్నేష్ శివన్ కు చెందిన ‘రౌడీ పిక్చర్స్’ సంస్థ కార్యాలయంలో భారీ ఎత్తున టపాసు కాల్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారని, ఆ విషయమై కన్నన్ పోలీసులకు పబ్లిక్ న్యూసెన్స్ కింద ఫిర్యాదు చేశాడని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి కారణం ఏదైనా… నయన్, విఘ్నేష్ శివన్ లను పోలీసులు విచారించడమైతే ఖాయమని తెలుస్తోంది.
