‘Rocketry’ OTT launch is on….!
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘రాకెట్రీ’. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఇదే నెల 1వ తేదీన విడుదలైంది. ఇస్రో శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నంబీ నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ’ని మాధవన్ తెరకెక్కించారు. సౌతిండియన్ వర్షన్స్ లో సూర్య ప్రత్యేక పాత్రను పోషించగా, సిమ్రాన్ నంబి నారాయణన్ భార్యగా నటించింది. దేశ రక్షణ శాఖకు సంబంధించిన కీలక రహస్యాలను పాకిస్తాన్ కు నంబి నారాయణన్ చేరవేశాడనే నెపం మీద ఆయనను దాదాపు యాభై రోజుల పాటు జైలులో పెట్టి తీవ్రంగా హింసించారు. కొన్నేళ్ళ న్యాయపోరాటం తర్వాత ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని రుజువైంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన కుటుంబ జీవితం విచ్ఛిన్నమైంది. ఉద్యోగం పోయింది. పిల్లలూ అనేక రకాలుగా అవమానాల పాలయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన అసత్య ఆరోపణ ఓ సైంటిస్ట్ జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందనే అంశాన్ని హృదయానికి హత్తుకునేలా మాధవన్ తెరకెక్కించారు. నంబి నారాయణన్ పాత్రకు జీవం పోశారు. ఈ సినిమా ఇదే నెల 26వ తేదీన వివిధ భారతీయ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘రాకెట్రీ’ అమెజాన్ ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను చేరువయ్యే ఆస్కారం ఉంది.
