‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆయనతో అనుభందం ఉన్నవారందరూ ఆయనను చివరిచూపు చూసి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ట్విట్టర్ ద్వారా తనదైన రీతిలో స్పందించాడు. ఆడియో ద్వారా ఆయన మాట్లాడుతూ..” సిరివెన్నెల ను నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటిసారి కలిశాను. శివ సినిమా కు ఒక మంచి కాలేజ్ సాంగ్ కావాలి అని అడగగానే ‘బోటని పాఠముంది.. మ్యాటనీ ఆట వుంది’ అంటూ టక్కున చెప్పేశారు.. ఆ పాట తరువాత నా ప్రతి సినిమాలో ఆయనతో పాటలు రాయించాను. మనిషి అన్నాకా చనిపోవడం సాధారణం.. అందరు ఎప్పుడో ఒకప్పుడు పోతారు.. కానీ, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్న మీరు కన్నుమూయడం కొంచెం బాధగా ఉన్నా.. సంతోషంగా ఉంది. తెలివి ఉన్నవాడు ఎవ్వడైనా సరే ఆనందపడతాడు. ఎందుకంటే మీరు ఇక్కడ కంటే బెటర్ ప్లేస్ కి వెళ్లారు. ఫ్యామిలీ మిస్ అవుతారు అనేది నాకు సంబంధం లేదు ..నేను ఒక ప్రేక్షకుడిగా నా స్వార్థంతో నేను చెప్తున్నాను.. మీరు అక్కడికి వెళ్లడం నాకు హ్యాపీగా ఉంది.
ఇకనుంచి అక్కడ మీకు కొత్త ఆడియెన్స్ ఉంటారు. నేనెప్పుడూ రంభ ఊర్వశి, మేనక, తిలోత్తమ లను చూడలేదు.. మీరు చూడండి .. వారికి నేను హాయ్ చెప్పానని చెప్పండి. ఇప్పటివరకు మీతో ఒక్కసారి కూడా వోడ్కా తాగలేదు.. ఒక వేళ నా తప్పులలో ఏమైనా తప్పుగా ఉండి యముడు నన్ను స్వర్గానికి కనుక తీసుకొస్తే అక్కడ మీతో వోడ్కా తాగుతాను. మీరు లక్కీగా అక్కడికి వెళ్లి స్వర్గం చూస్తున్నారు. అక్కడ వాట్సప్ కనుక ఉంటే అమృతం టేస్ట్ ఎలా ఉంది ..? రంభ ఊర్వశి, మేనక, తిలోత్తమ ఎలా ఉన్నారో నాకు చెప్పండి.. అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వాయిస్ క్లిప్స్ నెట్టింట వైరల్ గా మారాయి.