Site icon NTV Telugu

YVS : ప్రముఖ దర్శకులు వై వీ ఎస్ చౌదరి మాతృ మూర్తి అస్తమయం

Yvs Chowdary

Yvs Chowdary

ప్రముఖ దర్శకులు వై వీ ఎస్ చౌదరి మాతృ మూర్తి యలమంచిలి రత్నకుమారి అస్తమయం చెందారు. ఆమె పట్ల తన ప్రేమని గుర్తుచేసుకుంటూ ‘మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ ‘యలమంచిలి రత్నకుమారి’.కానీ ఒక లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు సినిమాలు చూపించడం నుండీ దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండివంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్ ఇత్యాది అవసరాలకు తన నోటి మీది లెక్కలతో బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మ.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మ. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మ. అటువంటి మా అమ్మ (88 యేళ్ళు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు ఈ భువి నుండి సెలవు తీసుకునిఆ దివిలో ఉన్న మా నాన్నని, మా అన్నని కలవడానికి వెళ్ళిపోయారు. ఆవిడ పంచిన రక్తం, ఆవిడ నింపిన లక్షణాలతో ఆమెను స్మరించుకుంటూ భాదతప్త హృదయంతో స్మరించుకున్నారు వై. వి. ఎస్‌. చౌదరి’

Exit mobile version