NTV Telugu Site icon

Sobhan Babu Death Anniversary : రామన్న తరువాత రాముడు!

Sobhan-Babu

(మార్చి 20న శోభన్ బాబు వర్ధంతి)
సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఎవరినైనా చిత్రసీమ తల్లిలా ఆదరిస్తుందని ఎందరో చెబుతూ ఉంటారు. చిత్రసీమలోనే నటునిగా నిలదొక్కుకోవడానికి నటభూషణ శోభన్ బాబు దాదాపు పుష్కరకాలం శ్రమించారు. 1959లో యన్టీఆర్ ‘దైవబలం’లో ఓ చిన్న పాత్ర ద్వారా తెరపై తొలిసారి కనిపించిన శోభన్ బాబు, తారాపథం చేరుకోవడానికి దాదాపు 12 ఏళ్ళు కష్టపడ్డారు. ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ సక్సెస్ తో శోభన్ బాబు కూడా స్టార్ హీరో అయిపోయారు. అంతకు ముందు ఆయన నటించిన చిత్రాలలో కొన్ని ఘనవిజయం చవిచూసినా, ఆ క్రెడిట్ మాత్రం శోభన్ కు దక్కలేదు. అందువల్ల 1971 వరకు ఆయన యన్టీఆర్ చిత్రాలలో సైడ్ హీరోగా నటిస్తూ వచ్చారు. ఆ తరువాత నుంచీ శోభన్ బాబు తారాపథంలో దూసుకుపోయారు.

యన్టీఆర్, ఏయన్నార్ సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తూ సాగిన శోభన్ బాబుకు 1963లో ‘నర్తనశాల’లో అభిమన్యునిగా నటించే అవకాశం లభించింది. ఆ కారణంగానే ‘వీరాభిమన్యు’లోనూ టైటిల్ రోల్ లో ఆయన నటించే ఛాన్స్ దక్కింది. ఈ రెండు చిత్రాలలో యన్టీఆర్ కథానాయకులు కావడం విశేషం. ఇక యన్టీఆర్ ‘లవకుశ’లో శత్రుఘ్నుని పాత్రలో నటించిన శోభన్ బాబు సరిగా తొమ్మిదేళ్ళ తరువాత 1972లో బాపు ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించే అవకాశం లభించింది. అప్పటికే కాదు, ఇప్పటికీ తెలుగువారికి శ్రీరాముడంటే యన్టీఆరే! అలా రామారావు అనితరసాధ్యంగా పోషించిన శ్రీరాముని పాత్రను శోభన్ బాబుతో బాపు తెరకెక్కించడం ఆ రోజుల్లో అందరూ సాహసమే అన్నారు. అయితే 1972 మార్చి 16న విడుదలైన ‘సంపూర్ణ రామాయణం’ విజయదుందుభి మోగించి, పది కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. తెలుగునాట యన్టీఆర్ తరువాత ఓ పౌరాణిక చిత్రంతో అన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసిన మరో హీరో మనకు కానరారు. అందుకే ‘రామన్న తరువాత రాముడు’గా శోభన్ బాబు నిలచిపోయారు. తెలుగునాట ఏయన్నార్, కాంతారావు, హరనాథ్, రవి, బాలకృష్ణ, జూ.యన్టీఆర్ వంటివారు కూడా శ్రీరాముని పాత్రల్లో అభినయించారు. అయితే రాముని పాత్రలో రామన్నకు తగ్గ తమ్ముడు శోభన్ బాబే అనిపించుకున్నారు.

అంతేకాదు, ఎందువల్లనో తొలి నుంచీ యన్టీఆర్ శోభన్ బాబును బాగా ప్రోత్సహించారు. తాను దర్శకత్వం వహించిన ‘సీతారామకళ్యాణం, శ్రీక్రిష్ణపాండవీయం’ చిత్రాలలో కీలక పాత్రలు పోషింప చేశారు. అంతేకాదు, తన నిర్మాతలకూ శోభన్ బాబును రికమెండ్ చేసేవారు. అలా దాదాపు 20కి పైగా యన్టీఆర్ చిత్రాలలో శోభన్ బాబు కీ రోల్స్ లో కనిపించారు. ఆ కారణంగానే యన్టీఆర్ ను తన దైవంగా భావించేవారు శోభన్ బాబు. అందువల్లే యన్టీఆర్ భారీ చిత్రాన్ని తన ఇంటిలో పెట్టుకున్నారు శోభన్ బాబు. రామన్న తరువాత రాముడుగా నిలచిన శోభన్ బాబు కృష్ణుని వేషంలోనూ ఆయన తరువాత తానే అనిపించుకొనే ప్రయత్నం చేశారు. బాపు ‘బుద్ధిమంతుడు’లో శ్రీకృష్ణుని పాత్రలో నటించారు శోభన్. ఆ తరువాత ‘కురుక్షేత్రం’లో శ్రీకృష్ణునిగానూ కనిపించారు. యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’ చిత్రం విడుదలైన రోజునే ‘కురుక్షేత్రం’ కూడా జనం ముందు నిలచింది. ‘దానవీరశూర కర్ణ’లో యన్టీఆర్ శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రల్లో నటించి అలరించారు. ఆ సినిమా ముందు ‘కురుక్షేత్రం’ నిలవలేక పోయింది. అలా కృష్ణుని పాత్రలో మాత్రం అన్న ముందు ఈ తమ్ముడు నిలవలేక పోయాడని శోభన్ బాబే చెప్పుకొనేవారు.