Regina Cassandra Fires On Journalist For This: ఈమధ్య కాలంలో కొందరు జర్నలిస్టులు సినిమాలకు సంబంధించినవి కాకుండా, నటీనటుల్ని ఇబ్బందికి గురి చేసే ప్రశ్నలు అడగడం సాధారణం అయిపోయింది. అవతల సెలెబ్రిటీలు నొచ్చుకుంటారా? లేదా? అసలు అలాంటి ప్రశ్న అడగొచ్చా? అనేది ఆలోచించకుండా అడిగేస్తుంటారు. ఆమధ్య డీజే టిల్లు ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్ హీరోయిన్ మచ్చల గురించి అడిగి, ఎంత దుమారం రేపాడో అందరికీ తెలిసిందే! హీరోయిన్ అతనికి ట్విటర్ మాధ్యమంగా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ రెజీనాను ఇబ్బందికి గురి చేసే ప్రశ్న అడగడంతో, ఆమె ఫైర్ అయ్యింది. కాకపోతే.. ఇక్కడ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కొంచెం డిఫరెంట్. మరీ బూతులేమీ లేవు. ఆ వివరాల్లోకి వెళ్తే..
రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో శాకిని డాకిని అనే సినిమా రూపొందుతోంది. సౌత్ కొరియన్ సినిమా ‘మిడ్‌నైట్ రన్నర్స్’కు ఇది రీమేక్. ఈనెల 16వ తేఈ సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో.. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్.. ‘మీరు ఈ చిత్రంలో ఓసీడీ ఉన్నట్లు నటించారు కదా? నిజ జీవితంలో కూడా మీకు ఓసీడీ ఉందా?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న తనని ఇబ్బందికి గురి చేయడంతో.. వెంటనే మైక్ అందుకొని ‘మీరు అందరినీ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా?’ అంటూ సీరియస్ అయ్యింది. తాము సినిమాలో కేవలం నటిస్తామని, పాత్ర డిమాండ్ మేరకు అలా చేయాల్సి ఉంటుందని, అంత మాత్రాన తనకు రియల్ లైఫ్‌లో ఓసీడీ ఉంటుందా? అని తిరిగి ప్రశ్నించింది. ఇందులో అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ సినిమా తీస్తే, మీరు ఓసీడీ గురించి అడుగుతారేంటి? అసలు మీకు ఓసీడీ అంటే ఏంటో తెలుసా? అంటూ నిలదీసింది. చివర్లో తనకు ఓసీడీ లాంటి డిజార్జర్స్ లేవని బదులిచ్చింది.
అప్పుడు జర్నలిస్ట్ మైక్ అందుకొని, తాను అడిగిన ప్రశ్న వెనుక తన ఉద్దేశం వేరని వివరణ ఇచ్చాడు. కరోనా తర్వాత అందరూ పరిశుభ్రత పాటిస్తున్నారు కదా, మీరు కూడా అలాగే ఉండటానికి ఇష్టపడతారా? అనేది తన ప్రశ్న ఉద్దేశమని తెలిపాడు. రిపోర్టర్ ఆ మాట చెప్పగానే రెజీనా కూల్ అయ్యింది. నవ్వుతూ.. తాను పరిశుభ్రంగానే ఉంటానని, అందరూ అలాగే ఉండాలని రెజీనా సమాధానమిచ్చింది.
