Pavitranath: మొగలిరేకులు ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ మార్చి 1 న మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే అతని మృతికి కారణాలు మాత్రం ఇంతవరకు తెలియలేదు. కొంతమంది గుండెపోటు వలన మృతి చెందాడు అని అంటుంటే.. ఇంకొందరు అతనుఎన్నోరోజులుగా డిప్రెషన్ లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. పవిత్రనాథ్ తన కెరీర్ ను సీరియల్స్ ద్వారా మొదలుపెట్టాడు. మొగలిరేకులు సీరియల్ లో దయ పాత్ర అతడికి గుర్తింపును తెచ్చింది. అసలు అతని సొంతపేరు కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ తరువాత మరికొన్ని సీరియల్స్ చేసినా కూడా పవిత్రనాథ్ కు గుర్తింపు దక్కలేదు.
ఇక ఆ తరువాత సీరియల్స్ ద్వారా కంటే అతని భార్య చేసిన ఆరోపణలు వలన మరింత ఫేమస్ అయ్యాడు. అతని భార్య శశిరేఖ.. పవిత్రనాథ్ పై ఎన్నో ఆరోపణలు చేసింది. తమకు 2009లో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. అమ్మాయిలంటే అతడికి పిచ్చి అని, తనను చిత్రహింసలకు గురిచేసేవాడని వివరించింది. పవిత్రనాథ్ జాతకాలు కూడా చెబుతుంటాడని, జాతకాలు చెబుతానని అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చి వారితో గంటలకొద్దీ గడుపుతుంటాడని, ఇదేమిటని తాను ప్రశ్నిస్తే తాగొచ్చి నానా రగడ చేస్తుంటాడని చెప్పుకొచ్చింది. దీంతో అతడి వ్యక్తిగత జీవితం నరకంగా మారింది. దానివలనే అతను ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడని అంటున్నారు. ఇక గతకొన్నిరోజులుగా పవిత్రనాథ్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇంకోపక్క భార్య ఆరోపణలు మనస్సును కలిచివేస్తుంటే.. అవి నిజం అని కానీ, అబద్దం అని కానీ స్పందించను కూడా లేదు. అలా అనారోగ్యానికి గురైన పవిత్రనాథ్ కు ఊపిరి తీసుకోవడం సమస్యగా మారడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అతడికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యిందని వైద్యులు ధృవీకరించారు. చికిత్స అందుకుంటూనే మార్చి 1 న పవిత్రనాథ్ కన్నుమూశాడు. అతని మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
