Reason Behind Why Krishna Called As Producers Hero: సినిమా నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీల బాధ్యత నిర్మాతలదే కాబట్టి.. ఆ విషయంలో హీరోలు జోక్యం చేసుకోరు. షూటింగ్‌లో పాల్గొన్నామా, తాము పడ్డ కష్టానికి పారితోషికం తీసుకున్నామా.. అన్నట్టు ఉంటారు. అఫ్‌కోర్స్.. తమ చిత్రం మంచి విజయం సాధించాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడతారు. ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. కానీ, లావాదేవీల వ్యవహారంలో జోక్యం చేసుకోరు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, వేరే సినిమా పనుల్లో నిమగ్నమైపోతారు. కొందరైతే, తాము తీసుకున్న పారితోషికం తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న హీరోలందరూ దాదాపు ఇదే చేస్తున్నారు. తమ చిత్రాలు బోల్తా కొడితే.. 80% లేదా పూర్తి పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగిస్తున్నారు.
కానీ.. సూపర్‌స్టార్ కృష్ణ అలా కాదు. తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే.. వెంటనే ఆ నిర్మాతలను పిలిచి, మరో మంచి కథని సిద్ధం చేసుకోమని చెప్పేవారు. తనకు ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఫ్రీగానే సినిమా చేస్తానని మాటిచ్చేవారు. ఇలా ప్రతీ నిర్మాతకు ఇచ్చిన మాటను కృష్ణ నిలబెట్టుకున్నారు. గడ్డుకాలంలో ఉన్న నిర్మాతల్ని గట్టెక్కించారు. ఇదే విషయాన్ని అప్పటి నిర్మాతలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు.. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను కూడా ఆదుకున్నారు. ఒక సినిమాతో నష్టపోతే, ఆ తర్వాత సినిమా హక్కుల్ని చాలా తక్కువ రేట్లకే ఇచ్చేవారు. మరో విశేషం ఏమిటంటే.. తాను హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చేసిన మొదటి 40 సినిమాల వరకూ.. కేవలం రూ. 5 వేల పారితోషికమే తీసుకున్నారు. ఏనాడూ పారితోషికం విషయంలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అందుకే, కృష్ణను నిర్మాతల హీరో అని చెప్తుంటారు.
కాగా.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడంతో.. ఇతర అవయవాలు పని చేయలేదు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఆయన మృతి చెందారు. కృష్ణ మృతితో యావత్ సినీ జగత్ శోకసంద్రంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయనకు సంతాపం ప్రకటించారు. కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
