Site icon NTV Telugu

రియల్ స్టార్ … అంటే అతనే!

ఓ సారి ఓ మెజీషియన్ జనం ఏది కావాలంటే అది తీసి ఇస్తున్నాడు. చివరకు స్టేజీపైకి ఏనుగు కావాలని కోరగానే, దానినీ తీసుకువచ్చాడు. ఇదంతా చూసిన ఓ అబ్బాయి వెళ్ళి ‘నన్ను తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోని చెయ్’ అని అడిగాడు. మెజీషియన్ చప్పున మాయమై పోయాడు. మళ్ళీ జనానికి కనిపించలేదు. ఈ కథ వింటే ఏమనిపిస్తోంది? ఎక్కడైనా హీరోగా రాణించవచ్చునేమో కానీ, ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో అది అంత సులువు కాదు అని దీని భావం. ఎందుకంటే తెలుగు చిత్రసీమలో హీరోలుగా రాణించాలంటే టాప్ హీరోల వారసులైనా కావాలి, లేదా స్టార్ ప్రొడ్యూసర్ల తనయులైనా అయి ఉండాలి. ఇదీ మనవాళ్ళ నమ్మకం. అయితే దానిని సైతం తోసి రాజని హీరోగా అలరించిన వారు కొందరున్నారు. వారిలో ‘రియల్ స్టార్’గా జేజేలు అందుకున్న శ్రీహరి కూడా చోటు సంపాదించారు.

బాడీ బల్డింగ్ చేసి, మంచి శరీరసౌష్టవంతో ఇట్టే ఆకట్టుకొనేవారు శ్రీహరి. క్రీడలపై ఆసక్తితో జిమ్నాస్టిక్స్ లో రాణించాలని తపించారు. నేషనల్ లెవెల్ దాకా వెళ్ళారు. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలోనూ రాణించవచ్చునని భావించారు. అనుకున్నదే తడవు మద్రాసు బయలుదేరి, కొత్తవారిని ప్రోత్సహించే దాసరి నారాయణరావును కలిశారు. శ్రీహరి ఫిజిక్ చూడగానే, తప్పకుండా చిత్రసీమలో రాణిస్తావని ఆశీర్వదించారు దాసరి. తాను తెరకెక్కించిన ‘బ్రహ్మనాయుడు’తో శ్రీహరిని తెరకు పరిచయం చేశారాయన. అప్పటి నుంచీ పలు చిత్రాలలో విలన్స్ గ్యాంగ్ లో ఒకరిగా, రౌడీగా, గూండాగా నటిస్తూ వచ్చారు శ్రీహరి. కొన్ని చిత్రాలలో కీలక పాత్రలూ పలకరించాయి. అయితే రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ దాకా గుర్తింపు ఉన్న పాత్రలు దక్కలేదు. ఆ సినిమాతో శ్రీహరికి మంచి గుర్తింపు లభించింది. ఎంతలా అంటే బాలకృష్ణతో సింగీతం తెరకెక్కించిన ‘శ్రీకృష్ణార్జున విజయం’లో సుయోధనునిగా నటించే అంత! ఆ సినిమా తరువాత విలన్ గా, కామెడీ విలన్ గా, కమెడియన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా సక్సెస్ రూటులో సాగిపోయారు శ్రీహరి. అదే సమయంలో ప్రముఖ నిర్మాత కె.మహేంద్రకు శ్రీహరిని హీరోని చేయాలన్న ఆలోచన కలిగింది. తాను నిర్మించిన ‘పోలీస్’తో శ్రీహరిని హీరోగా పరిచయం చేశారాయన. ఆ తరువాత శ్రీహరి హీరోగా నటించిన ‘దేవా, సాంబయ్య’ చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి. అప్పటి నుంచీ కొంతకాలం హీరోగా సాగారు శ్రీహరి. ఆ తరువాత తన దరికి చేరిన కేరెక్టర్ రోల్స్ లోనూ అలరించసాగారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ఉత్తమ సహాయనటునిగా నంది అవార్డును అందుకున్నారు శ్రీహరి. ఆ తరువాత నుంచీ శ్రీహరిని అలాంటి పాత్రలే పలకరించసాగాయి. రాజమౌళి ‘మగధీర’లో షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి అభినయం అందరినీ ఆకట్టుకుంది. అక్కడ నుంచి శ్రీహరికి మరింత ఆదరణ పెరిగింది. జనం శ్రీహరిని ‘రియల్ స్టార్’ అని కీర్తించారు. శ్రీహరి కెరీర్ సాగిన తీరును గమనిస్తే, ‘రియల్ స్టార్’ అన్న టైటిల్ అతనికి తగ్గదే అనిపిస్తుంది. 2013లో శ్రీహరి హఠాన్మరణం అభిమానులను కలచివేసింది.

శ్రీహరి చిత్రసీమకు చెందిన ప్రముఖ నృత్యతార డిస్కోశాంతిని వివాహమాడారు. వారికి ఇద్దరు అబ్బాయిలు. శ్రీహరి, శాంతికి ఓ కూతురు పుట్టి నాలుగు నెలలకే కన్నుమూసింది. ఆ పాప పేరుతో ‘అక్షర ఫౌండేషన్’ స్థాపించారు. తన సంపాదనలో యాభై శాతం ఆ ఫౌండేషన్ కే అందించేవారు. ఫౌండేషన్ ద్వారా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడివారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు. శ్రీహరి తనయుల్లో చిన్నవాడు కొన్ని చిత్రాలలో బాలనటునిగా నటించాడు. ఆ మధ్య హీరోగానూ పరిచయమయ్యాడు. ఏది ఏమైనా ఈ నాటికీ ‘రియల్ స్టార్’గా శ్రీహరి జనం మదిలో నిలచిపోయారు.

Exit mobile version