Rayavalasa : కొడుకు హీరో తల్లి డైరెక్టర్ తండ్రి నిర్మాత.. ఆకట్టుకునేలా రాయవలస టీజర్

Rayavalasa

Rayavalasa

ఇటీవల తెలుగులో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది, ఇదే కోవలో రాబోతున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “రాయవలస”. ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ సినిమాలోని ప్రధాన బాధ్యతలు తీసుకోవడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. కార్తీక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని అతని తండ్రి గోపీకృష్ణ జె. నిర్మించగా, తల్లి రాధిక జయంతి దర్శకత్వం వహించడం విశేషం. రేసన్ (RaysuN) ప్రొడక్షన్స్ పతాకంపై “లవ్ టైడ్ బై ఫేట్” (Love Tied by Fate) అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన రాగా, తాజాగా చిత్ర బృందం టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ వేడుకకు యువ హీరో ఆకాష్ జగన్నాథ్, ప్రముఖ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

తనకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణమని, తన కలను నిజం చేసిన తల్లిదండ్రులకు హీరో కార్తీక్ జయంతి కృతజ్ఞతలు తెలిపారు. “రాయవలస రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఒక రాజు-రాణి కథ. సినిమాలోని ఇంటర్వెల్, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కంటెంట్ కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది, మమ్మల్ని ఆదరించండి” అని కార్తీక్ ధీమా వ్యక్తం చేశారు. దర్శకురాలు రాధిక జయంతి మాట్లాడుతూ.. “నా కొడుకును నేనే హీరోగా లాంచ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రచయిత రాఖీ చెప్పిన కథ బాగా నచ్చడంతో నా భర్త గోపీకృష్ణ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషితో విజువల్స్, మ్యూజిక్ అద్భుతంగా వచ్చాయి. మా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.