Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi success: ఒకప్పుడు సినిమా పెద్ద హిట్ కావాలంటే కథ ఎంత పెద్దదిగా ఉంటే అంత మంచిదని భావించేవారు. ఆ తర్వాత పాన్ ఇండియా అనే పదం ఇండియన్ సినిమా బిజినెస్‌ను పూర్తిగా మార్చేసింది. స్టార్ హీరో, భారీ బడ్జెట్, విదేశీ లొకేషన్లు, హాలీవుడ్ స్థాయి యాక్షన్, ఇతర భాషల నటీనటులు ఉంటే దేశవ్యాప్తంగా మార్కెట్ వస్తుందని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు మాత్రం మరో విషయాన్ని చెబుతున్నట్లు కనిపిస్తోంది. కథ ఎంత దూరం వెళ్లిందనేది కాదు, ప్రేక్షకుడి మనసుకు ఎంత దగ్గరగా వెళ్లిందనేదే అసలు ప్రశ్నగా మారుతోంది. తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ విజయం నేపథ్యంలో టాలీవుడ్లో ఇదే అంశంపై కొత్త చర్చ మొదలైంది. ఈ మూవీ అసలు పాన్ ఇండియా కోసం పరుగులు పెట్టడం కంటే మన కథలు, మన సంస్కృతిని తెరపై నిజాయితీగా చూపిస్తే పెద్ద విజయం సాధ్యమే కదా అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తోంది.
దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా కనిపించారు. ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథలో తండ్రి, కూతురు అనుబంధంతో సాగుతుంది. ‘ఇరుముడి’ అనే టైటిల్, తండ్రి, కూతురు బంధం, అయ్యప్ప భక్తి, కథలోని క్రైమ్ వంటి పలు లేయర్లతో ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక్కడే ‘ఇరుముడి’ హిట్ ను టాలీవుడ్లో కొందరు నిర్మాతలు ప్రత్యేకంగా చూస్తున్నారు. భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాల కోసం కథను మార్చడం, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు, యాక్షన్ సీన్లు, సెట్లు పెంచడం కంటే ముందుగా తెలుగు ప్రేక్షకుడికి కథ కనెక్ట్ అవుతుందా లేదా అనేదే ముఖ్యమని అభిప్రాయ పడుతున్నారు. ప్రేక్షకుడికి తన కుటుంబం కనిపించాలి, తన ఊరు కనిపించాలి, తన జీవితం కనిపించాలి, తన భావోద్వేగం తెరపై కనిపించాలి. అలాంటి అనుభూతి కలిగినప్పుడు సినిమా భాష, మార్కెట్ సరిహద్దులు దాటి వెళ్లే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
- Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
- Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
అయితే ఈ చర్చ కేవలం ‘ఇరుముడి’ వరకే పరిమితం కావడం లేదు. గత కొంతకాలంగా టాలీవుడ్లో పాన్ ఇండియా మార్కెట్ కోసం బడ్జెట్లు భారీగా పెంచుతున్న విధానంపై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఒక కథను రూ.50 కోట్లలోనే సమర్థవంతంగా చెప్పగలిగినప్పుడు, దానికి దేశవ్యాప్తంగా మార్కెట్ రావాలనే ఉద్దేశంతో భారీ సెట్లు, ఖరీదైన యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇతర భాషల నటీనటులు, విస్తృతమైన ప్రమోషన్స్ జోడించి బడ్జెట్‌ను రూ.200 కోట్లకు 300ల కోట్లకు పెంచడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ఎదురవుతోంది. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోతే ఆ మొత్తం పెట్టుబడిని తిరిగి రాబట్టడం నిర్మాతలకు పెద్ద సవాలుగా మారుతుంది.
పాన్ ఇండియా అనే ట్యాగ్ వచ్చినంత మాత్రాన ప్రతి సినిమాకు అన్ని రాష్ట్రాల్లో ఒకే స్థాయిలో ప్రేక్షకాదరణ వస్తుందని భావించడం కూడా ప్రమాదకరమే. కొన్ని తెలుగు సినిమాలు ఇతర భాషల్లో సంచలనం సృష్టించాయి. అదే సమయంలో భారీ స్థాయిలో ప్రచారం పొందిన కొన్ని సినిమాలు మాత్రం ఘోర పరాభవాన్ని కూడా చవి చూశాయి. దీనికి కారణం కేవలం స్టార్ పవర్ కాదు. స్థానిక ప్రేక్షకుడికి కథ ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేదే కీలకం అవుతోంది.
‘ఇరుముడి’తో పాటు ఈ మధ్య వచ్చిన ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి సినిమాలు విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా బాక్స్ ఆఫీస్ హిట్ గా తిరుగులేని విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా సినిమాను మరింత జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి కేవలం భారీ బడ్జెట్ సరిపోదని, కథలో కొత్తదనం ఉండాల్సిందే అనే సంకేతం ఇది. ఎందుకంటే వందల కోట్లు ఖర్చు పెట్టిన పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ను పరిశీలిస్తే ప్రేక్షకుడి నాడి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.
మరోవైపు యువ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థ, శర్వానంద్ వంటి హీరోలు విస్తృత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడం సహజమే. అయితే ముందుగా ఇళ్ళు గెలిచి, తరవాత రచ్చ గెలవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే లోకల్ గా హిట్ అయిన తర్వాత ఇతర భాషల్లోకి తీసుకెళ్తే నిర్మాతలు సేఫ్ గా ఉండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఒకేసారి అన్ని భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడం వల్ల వచ్చే అదనపు ఖర్చు, రిస్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మాతలు సూచిస్తున్నారు.
ఇక మలయాళ సినిమా గత కొన్నేళ్లుగా ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలుస్తోంది. అక్కడి సినిమాలు మొదట తమ ప్రాంతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతాయి. ఆ తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇతర భాషల్లోకి వెళ్లి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మద్దతును సంపాదించుకుంటున్నాయి. తమిళ సినిమాల్లోనూ రూటెడ్ కథలకు ఉన్న బలం చాలా కాలంగా కనిపిస్తోంది.
ఇక్కడ ‘ఇరుముడి’ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. భారీ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఈ కథను సిద్ధం చేయకుండా, ఒక చిన్న ప్రాంతం, ఒక కుటుంబం, ఒక తండ్రి, ఒక కూతురు ఎమోషన్ చుట్టూనే కథ తిరుగుతుంది. అదే సమయంలో యాక్షన్, థ్రిల్లర్, భక్తి అంశాలను కలిపి కమర్షియల్ అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. ఫలితం 300 కోట్ల మార్కును కూడా ఈ సినిమా అందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ ముందున్న అసలు ప్రశ్న పాన్ ఇండియా సినిమాలు చేయాలా వద్దా అనేది కాదు. పాన్ ఇండియా మార్కెట్ కోసం మన కథను మార్చాలా, లేక మన కథను మరింత బలంగా చెప్పి అది సహజంగానే ఇతర భాషల ప్రేక్షకుల వద్దకు వెళ్లేలా చేయాలా అనేదే. ప్రపంచంలోని అనేక సినిమా పరిశ్రమలు ముందుగా తమ ప్రేక్షకుల కోసం కథలు చెబుతున్నాయి. కంటెంట్ ఉంటే ప్రపంచ ప్రేక్షకులు కూడా లోకల్ సినిమాలకు కనెక్ట్ అవుతున్నారు. తెలుగు సినిమాకు కూడా అలాంటి సామర్థ్యం ఉందనేది ఈ చర్చలోని కీలక అంశం.
చివరికి ప్రేక్షకుడు ఎంత ఖరీదైన సెట్స్ వేశారో, ఎన్ని దేశాల్లో షూటింగ్ చేశారో, ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారో మాత్రమే చూడడు. తెరపై కనిపించే మనిషి తనకు ఎంత దగ్గరగా ఉన్నాడు, అతని బాధ తనను ఎంత తాకింది, అతని ప్రయాణంలో తన జీవితంలోని ఏదైనా భాగం కనిపించిందా అనేదే నిర్ణయిస్తుంది. అందుకే ‘ఇరుముడి’ విజయాన్ని కేవలం రవితేజకు వచ్చిన మరో హిట్‌గా చూడటం కంటే, టాలీవుడ్ కథల దిశపై ప్రేక్షకుడు ఇస్తున్న ఒక సంకేతంగా చూడాల్సి ఉంటుందేమో. పాన్ ఇండియా అనే లక్ష్యం ఉండొచ్చు. కానీ ఆ ప్రయాణం మొదలయ్యేది మాత్రం మన నేల నుంచే కావాలన్న సందేశాన్ని ఈ సినిమా మరోసారి గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!