NTV Telugu Site icon

Ravi Raja Pinisetty : రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ చూసిన రవిరాజా!

Raviraja

Raviraja

దర్శకునిగా రవిరాజా పినిశెట్టి జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారాయన. ‘చంటి, పెదరాయుడు’ వంటి రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ను సొంతం చేసుకున్నారాయన. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే!

రవిరాజా పినిశెట్టి 1949 జూలై 14న పాలకొల్లులో జన్మించారు. ఆయన తండ్రి పినిశెట్టి రామ్మూర్తి అనేక తెలుగు చిత్రాలకు రచన చేశారు. రవిరాజా పినిశెట్టి మనసు కూడా తొలి నుంచీ సినిమాలవైపే సాగింది. దాంతో చదువు పూర్తయ్యాక దాసరి నారాయణరావు వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రవిరాజా. మాదాల రంగారావు హీరోగా రూపొందిన ‘వీరభద్రుడు’ చిత్రంతో దర్శకుడయ్యారు. రెండో సినిమా చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ‘జ్వాల’. ఆ తరువాత ‘అవల్ సుమంగళిదాన్’ చిత్రాన్ని తెలుగులో ‘పుణ్యస్త్రీ’గా తెరకెక్కించారు. ఈ సినిమాతో రవిరాజాకు మంచి గుర్తింపు లభించింది. ‘జ్ఞాన ఒలి’ రీమేక్ గా చిరంజీవి, మోహన్ బాబుతో తెరకెక్కిన ‘చక్రవర్తి’కి కూడా రవిరాజా దర్శకత్వం వహించారు. ఆయన పలు రీమేక్స్ తీసినా, రవిరాజాను స్టార్ డైరెక్టర్ గా మార్చింది చిరంజీవి ‘యముడికి మొగుడు’ అనే చెప్పాలి. ఆ సినిమా తరువాత రవిరాజా తీరే మారింది.

తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అంకుశం’ చిత్రాన్ని హిందీలో చిరంజీవితో ‘ప్రతిబంధ్’గా రీమేక్ చేశారు. ఆ సినిమా ద్వారా హిందీ సినిమా రంగంలో అడుగుపెట్టారు రవిరాజా. యండమూరి వీరేంద్రనాథ్ ‘థ్రిల్లర్’ నవలను ‘ముత్యమంత ముద్దు’గా రూపొందించారు. అలాగే మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘యమపాశం’ నవలను అదే పేరుతో తెరకెక్కించారు రవిరాజా. తమిళ ‘మైడియర్ మార్తాండన్’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో ‘రాజా విక్రమార్క’గా రూపొందించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘చిన్నతంబి’ని వెంకటేశ్ హీరోగా ‘చంటి’ పేరుతో రవిరాజా దర్శకత్వంలో కె.యస్.రామారావు నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. తెలుగులో ఘన విజయం సాధించిన ‘గ్యాంగ్ లీడర్’ను హిందీలో రవిరాజా ‘ఆజ్ కా గూండా రాజ్’ పేరుతో రీమేక్ చేయగా, చిరంజీవి నటన అక్కడి వారినీ ఆకట్టుకొనేలా ఆ సినిమాను తెరకెక్కించారు. తరువాత “బలరామకృష్ణులు, కొండపల్లి రాజా” వంటి రీమేక్స్ తో అలరించిన రవిరాజా, బాలకృష్ణతో ‘బంగారుబుల్లోడు’ రూపొందించి అనూహ్య విజయం సాధించారు. అయినా రీమేక్స్ పైనే దృష్టి సారించి, “ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ, ఎస్పీ పరశురామ్, పెదరాయుడు” వంటి చిత్రాలను రూపొందించారు. వీటిలో ‘పెదరాయుడు’ సంచలన విజయం సాధించింది. ఆపై కొన్ని స్ట్రెయిట్ మూవీస్ తీసినా, రవిరాజా దర్శకత్వంలో “రాయుడు, అల్లుడుగారు వచ్చారు, రుక్మిణి, మా అన్నయ్య, శుభకార్యం, అధిపతి, మా బాపూ బొమ్మకు పెళ్ళంట, వీడే, అందమైన అబద్ధం” వంటి రీమేక్స్ తోనే సాగారు. వీటిలో ‘మా అన్నయ్య’ మంచి విజయం సాధించింది.

రవిరాజా పినిశెట్టి చిన్నకొడుకు ఆది పినిశెట్టి నటునిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించి సాగుతున్నాడు. ఆయన పెద్ద కొడుకు సత్యప్రభాస్ తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకుడుగా మారారు. తనయుల చిత్రసీమ ప్రయాణాన్ని చూస్తూ రవిరాజా పినిశెట్టి పుత్రోత్సాహంలో ఉన్నారు. మళ్ళీ రవిరాజా మెగాఫోన్ పట్టి సినిమా తీస్తే చూడాలని, ఆయన చిత్రాలను అభిమానించేవారు ఆశిస్తున్నారు.

Show comments