Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్‌డేట్

Mysa (1)

Mysa (1)

Mysa: స్టార్ హీరోయిన్‌గా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న మరోసారి తన కమిట్‌మెంట్‌ను నిరూపిస్తున్నారు. ఒకవైపు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ షెడ్యూల్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు నటిగా కొత్త ప్రయోగాలకు కూడా వెనుకాడడం లేదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న ‘మైసా’ సినిమా కోసం ఓ సాహసమే చేసిందట. రీసెంట్ గా నీటి అడుగున సాగే క్లిష్టమైన సన్నివేశాలను పూర్తి చేసినట్లు చిత్రబృందం కూడా తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ‘మైసా’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని కొత్త తరహా పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. తాజాగా సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన నీటిలోపల సాగే యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సన్నివేశాలను ఆమె విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

చిత్రబృందం తెలిపిన వివరాల ప్రకారం, ఈ అండర్‌వాటర్ ఎపిసోడ్ సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలవనుంది. ఫుటేజ్ కూడా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులకు థియేటర్లలో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుందని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సన్నివేశాల కోసం ప్రత్యేక ప్రణాళికతో షూటింగ్ నిర్వహించినట్లు సమాచారం. కేరళ అడవుల్లో అతిరపల్లి జలపాతం వద్ద 80 అడుగుల ఎత్తు నుంచి దూకే క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల్లో రష్మిక డూప్ లేకుండా నటించి, అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో సహా కీలకమైన ఘట్టాలను పూర్తి చేశారు. ప్రస్తుతం ‘మైసా’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మిగిలిన సన్నివేశాలను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.  తాజా సమాచారం ప్రకారం టీజర్ జూలై 15న రిలీజ్ చేసి , అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హై స్టేక్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ స్వరాలు అందిస్తున్నారు. అలాగే నటుడు తారక్ పొన్నప్ప కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న, ‘మైసా’లో పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.