Site icon NTV Telugu

Rashmika Mandanna: రెమ్యునరేషన్ అమాంతం పెంచిన రశ్మికా.. ఎంతంటే?

Rashmika Hikes Remuneration

Rashmika Hikes Remuneration

Rashmika Mandanna Hikes Her Remuneration: సాధారణంగా ఒక హిట్ పడితేనే.. నటీనటులు తమ రెమ్యునరేషన్ పెంచేస్తారు. అలాంటిది.. పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉంటే? పాచికలు తమ చేతిలో ఉన్నట్టే! అడిగినంత పారితోషికం పుచ్చుకోవడంతో పాటు ఇతర డిమాండ్లు పూర్తి చేసుకోవచ్చు. కన్నడ బ్యూటీ రశ్మికా మందణ్ణ ఇప్పుడు అలాంటి విలాసాలే అనుభవిస్తోందని సమాచారం. నేషనల్ క్రష్‌గా అవతరించినప్పటి నుంచి ఈ బ్యూటీకి వరుసగా క్రేజీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.

ఇక ‘పుష్ప’ తర్వాత మరింత క్రేజ్ వచ్చిపడటంతో.. ఈమె కెరీర్ ఇంకా పుంజుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ అవకాశాలు అందుకుంటోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా.. ఇప్పుడు తనకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో పారితోషికం భారీగా పెంచేసిందని తెలుస్తోంది. ‘పుష్ప’ కంటే ముందు.. రశ్మికా మందణ్ణ ఒక్కో సినిమాకి గాను రూ. 1 కోటి పారితోషికం తీసుకునేది. కానీ.. ఆ సినిమా రిలీజయ్యాక తనకు డిమాండ్ పెరిగిపోవడంతో, తన రెమ్యునరేషన్ ఫిగర్‌ను ఏకంగా రూ. 4 కోట్లకు పెంచేసిందట! అయితే.. తెలుగు సినిమాలకు మాత్రం రూ. 3 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు, ఇతర ఖర్చులు కూడా నిర్మాతలే చూసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. రశ్మికాకి ఉన్న స్టార్డమ్ దృష్ట్యా.. ఆమెకి అంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు సుముఖంగానే ఉన్నట్టు తెలిసింది. కాగా.. రీసెంట్‌గా రశ్మికా మందణ్ణ ‘సీతారామం’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ముస్లిం యువతి ఆఫ్రిన్ పాత్రలో నటించి, మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు.. మూడు హిందీ సినిమాలతో పాటు ఒక తమిళం, ఒక తెలుగు చిత్రంలో రశ్మికా ఫుల్ బిజీగా ఉంది.

Exit mobile version