‘జవాన్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ, ఇప్పుడు తన తదుపరి సినిమా “AA22 x A6” కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఆయన మరోసారి సౌత్ నుంచి బాలీవుడ్ వరకు హడావుడి చేయబోతున్నాడు. ఇందులో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దీపికా భర్త రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ హైప్‌ను ఆకాశానికెత్తేశాయి.
చింగ్స్ యాడ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్, అట్లీ గురించి మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించాడు. “జవాన్‌తో దేశమంతా ఆయన పేరు మార్మోగింది. కానీ అంతకంటే ముందే, ఆయన ‘మెర్సల్’ సినిమా చూసిన తర్వాత నేను అట్లీకి మెసేజ్ చేశా. ‘సర్, మీ సినిమా అద్భుతం. మీరు ముంబైకి రావాలి, మనం కలిసి ఒక సినిమా చేయాలి’ అని అప్పుడే చెప్పా. అట్లీ నా చాలా సన్నిహిత మిత్రుడు. ఆయనతో పని చేయడం ఎప్పుడూ ఒక కలలా ఉంటుంది” అని రణ్‌వీర్ గుర్తుచేసుకున్నాడు.
అట్లీ తెరకెక్కిస్తున్న “AA22 x A6” గురించి రణ్‌వీర్ మరింత ఎగ్జైట్ అయ్యాడు.. “అట్లీతో పాటు ఆయన టీమ్ అద్భుతమైనది. కెమెరామెన్ జి.కె. విష్ణుతో పనిచేయడం కూడా గొప్ప అనుభవం. నా భార్య దీపికా ఆ సెట్‌లో ఉన్నందున నేను అక్కడికి వెళ్లాను. నిజంగా చెబుతున్నా – ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చూడని, అద్భుతాన్ని వారు సృష్టిస్తున్నారు” అని రణ్‌వీర్ ఆశ్చర్యంతో చెప్పాడు. ఇక దర్శకుడు అట్లీ కూడా కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై మాట్లాడాడు.. “ఈ సినిమా చాలా కొత్తగా, ఆలోచనాత్మకంగా, ప్రేక్షకులను స్క్రీన్‌కు అతుక్కుపోయేలా ఉంటుంది. హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఇందులో భాగం అవుతున్నారు. వాళ్లే చెబుతున్నారు – ఇది చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్ అని. మేము నిజంగా ఏదో పెద్దదాన్ని సృష్టిస్తున్నాం” అని అట్లీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి, అట్లీ – అల్లు అర్జున్ కాంబినేషన్‌పై ఇప్పటికే సౌత్‌లో హైప్ ఉండగా, రణ్‌వీర్ సింగ్ లాంటి స్టార్ ఇచ్చిన కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై నేషనల్ లెవల్‌లో అటెన్షన్ తెచ్చాయి.
