Ramayana: భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ‘రామాయణం’ ఒకటి. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలు, భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింబ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైలర్‌ను దేశ రాజధానిలో అత్యంత వైభవంగా ఆవిష్కరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణం’ ట్రైలర్‌ను జూలై 18న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించే భారీ కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. భారతీయ సంస్కృతి, పురాణ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఈ సినిమా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రాతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం కూడా హాజరుకానున్నట్లు సమాచారం. దీంతో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని స్థాయిలో ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో కూడా గుప్పుమంటున్నాయి.
రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ ఇతిహాస చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, సాయి పల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. రావణుడిగా యశ్ నటిస్తుండగా, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించనున్నారు. అలాగే రవీ దూబే, రాకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తారాగణం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్‌తో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని 2026 దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. ఇప్పటికే ‘రామాయణం’పై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో, జూలై 18న విడుదల కానున్న ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతుందా అనే ఉత్కంఠ ఇప్పుడు సినీ అభిమానుల్లో కనిపిస్తోంది.

