Bollywood Controversy: ఇండియన్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ‘రామాయణం’ ఒకటి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీలో జరిగిన ఈవెంట్ తో భారీ అంచనాలను సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే సినిమా విడుదలకు ముందే మరోసారి వివాదం చెలరేగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సీత పాత్రలో సాయి పల్లవిని ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించడంతో పాటు, దర్శకుడు నితేష్ తివారీపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో అను కపూర్ మాట్లాడుతూ, రామాయణం వంటి పవిత్రమైన ఇతిహాసాన్ని తెరపైకి తీసుకురావడం చాలా బాధ్యతతో కూడుకున్న పని అని అన్నారు. సాంకేతికంగా ఎంత గొప్పగా సినిమా తీసినా, ప్రేక్షకులు ముందుగా గమనించేది పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులేనని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారతీయులు సీతామాతను తల్లిగా, శ్రీరాముడిని దైవస్వరూపుడిగా భావిస్తారని, అలాంటి పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తున్నారనేది చూడటం జరుగుతుందని చెప్పారు. అయితే సినిమా విడుదలయ్యాకే దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడతానని కూడా పేర్కొన్నారు.
‘ఈమె ఎలాంటి సీత?’ అంటూ రామాయణంలో సాయి పల్లవిని ఎంపిక చేయడంపై అను కపూర్ తీవ్రంగా విమర్శించారు. అలాగే దర్శకుడు నితేష్ తివారీ గురించి తనకు పెద్దగా తెలియదని అను కపూర్ వ్యాఖ్యానించారు. నితేష్ తివారీ ఎవరో నాకు తెలియదు. నేను సినిమాలు పెద్దగా చూడను. అందుకే ఎవరిని తెలుసుకోవాల్సిన అవసరం కూడా అనిపించదు. ఆయన తన సినిమా తీయనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
అను కపూర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమిర్ ఖాన్ గురించి ప్రశ్నించగా ఆమిర్ ఖాన్ ఎవరు ? అని వ్యాఖ్యానించారు. అలాగే 2024లో చండీగఢ్ విమానాశ్రయంలో కంగనా రనౌత్‌కు సంబంధించిన ఘటనపై స్పందించమని అడిగినప్పుడు కూడా కంగనా ఎవరు? అంటూ వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన తరచూ ఇలాంటి ముక్కుసూటి వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్రంగా మారుతున్నారనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది.
నిజానికి అను కపూర్ 2023 నుంచే నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కూడా మతపరమైన అంశాలను అత్యంత జాగ్రత్తగా తెరకెక్కించాలని, ఇలాంటి కథలతో ప్రయోగాలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడు సాయి పల్లవి ఎంపికపై చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలను మరోసారి కొనసాగించారు.
ఇదిలా ఉండగా, నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామాయణం’ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. యష్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, దానిపై వస్తున్న ప్రశంసలు, విమర్శలు, వివాదాలు మాత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మరింత బజ్ ని పెంచుతున్నాయి.

