Ram karthik: రామ్ కార్తీక్, ప్రిష జంటగా జి. వి. చౌదరి, నాగరాజు చిర్రా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఔను.. నేనింతే!!. డి. వి. కె నాగేశ్వరరావు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో బుధవారం ఘనంగా జరిగాయి. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటులు పృథ్వీ క్లాప్ కొట్టగా, నటుడు అనీష్ కురువెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేశారు.చిత్ర సమర్పకులు యం ఏ. సత్తార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ, ”ఇది మా రెండవ సినిమా. మొదటి చిత్రం ‘నీ జత లేక’. దాని తర్వాత తీస్తున్న సినిమా ఇది. దర్శకుడు నాగేశ్వరరావు చెప్పిన కథ నచ్చడంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచింప జేసే విధంగా ఇది తెరకెక్కబోతోంది” అని అన్నారు.
దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ”ఇదొక యాంటీ లవ్ స్టోరీ. రివర్స్ స్క్రీన్ ప్లేతో రాసుకున్న కథ. క్షణ క్షణం అడ్వాన్స్ అయిపోతున్న ప్రస్తుత ట్రెండ్ లో యూత్ ఇంకా అడ్వాన్స్డ్ గా చేసే పనుల వల్ల వారి జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించబోతున్నాం. అండర్ కరెంట్ మెసేజ్ ఇస్తూ అవుట్ అండ్ అవుట్ కామెడీ తో ఈ మూవీ ఉంటుంది” అని అన్నారు. యూత్ తో పాటు పేరెంట్స్ కు చక్కని మెసేజ్ అందించబోతున్న ఈ సినిమాలో తానో చక్కని పాత్ర చేయబోతున్నట్టు పృథ్వీ తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె మాట్లాడుతూ, ”మంచి లవ్ స్టోరీతో పాటు ఇందులో చాలా ఏమోషన్స్ వున్నాయి. ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు చాలా చక్కగా కుదిరాయి. ఇవన్నీ కూడా సిచ్యుయేషన్ కు తగ్గట్టు ఉంటాయి” అని చెప్పారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ”ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు చేశాను. దర్శకులు నాగేశ్వరరావు చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను” అని అన్నారు. ఇలాంటి ఓ మంచి చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ ప్రిష తెలిపింది.
