Site icon NTV Telugu

Rajanikanth: ‘లాల్ సలామ్’ అంటున్న సూపర్ స్టార్ డాటర్!

Lal Salam

Lal Salam

Aishwarya Rajinikanth: ప్లే బ్యాక్ సింగర్, డైరెక్టర్ అయిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుంది. ఈసారి విష్ణు విశాల్, విక్రాంత్ తో ఆమె ‘లాల్ సలామ్’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. విశేషం ఏమంటే… ఈ మూవీలో రజనీకాంత్ కూడా ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటించడం ఇదే మొదటిసారి. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘త్రీ’ మూవీలో అప్పటి ఆమె భర్త ధనుష్‌ హీరోగా నటించగా, కమల్ హాసన్ కుమార్తె శ్రుతీహాసన్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మరో సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య మళ్ళీ ఆరేళ్ల తర్వాత ఇప్పుడీ మూవీని రూపొందిస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమౌతున్న ‘లాల్ సలామ్’ మూవీ పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. రజనీకాంత్ దంపతులు దీనికి హాజరై కుమార్తెకు, చిత్ర బృందానికి ఆశీస్సులు అందించారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రంగస్వామి సినిమాటోగ్రాఫర్ కాగా, రాము త్యాగరాజ్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ భాస్కర్ కూర్పరి. పూర్ణిమా రామస్వామి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. వచ్చే యేడాదిలో ఈ సినిమా జనం ముందుకు రానుంది.

Exit mobile version