నటుడిగా రజనీకాంత్ ది నలభై ఆరేళ్ల సుదీర్ఘ ప్రయాణం. చిత్రం ఏమంటే నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఏదీ ఇంతవరకూ దక్కలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారంతోనూ, 2016లో పద్మ విభూషణ్ పురస్కారంతోనూ గౌరవించింది. ఇక తాజాగా 2021కి సంబంధించి సినిమా ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సోమవారం రజనీకాంత్ అందుకున్నారు. విశేషం ఏమంటే… ఇదే వేదిక మీద ఆయన పెద్దల్లుడు ధనుష్ సైతం ఉత్తమ నటుడిగా ‘అసురన్’ సినిమాకు గానూ అవార్డు అందుకున్నాడు.
Read Also : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గురువుకు అంకితమిచ్చిన రజినీకాంత్
నటుడు, నిర్మాత ధనుష్ ఇంతవరకూ నాలుగు జాతీయ పురస్కారాలు పొందాడు. అందులో నిర్మాతగా రెండు సార్లు, నటుడిగా రెండు సార్లు అవార్డులు అందుకున్నాడు. 2010లో ధనుష్ ‘ఆడుకాలమ్’ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును అందుకోగా, ఇవాళ రెండో సారి అవార్డును స్వీకరించాడు. అయితే…. ఈ రెండు సార్లు కూడా ధనుష్ తన అవార్డును వేరొకరితో కలిసి షేర్ చేసుకోవడం చిత్రం! 2010లో ధనుష్, మలయాళ నటుడు సలీమ్ కుమార్ ఉత్తమ నటుడు కేటగిరికి ఎంపిక కాగా ఈసారి ధనుష్, ప్రముఖ హిందీ నటుడు మనోజ్ వాజ్ పాయ్ ఉత్తమ జాతీయ నటులుగా అవార్డులు పొందారు.
