Rajesh Danda Birthday Special Interview: డిస్ట్రిబ్యూటర్ గా కంటే నిర్మాతగా ప్రయాణం బాగుందనీ, నచ్చిన కథతో ప్రయాణం చేసే వెసులుబాటు నిర్మాతగా ఉంది అని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా అంటున్నారు. నేను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు సందీప్ కిషన్, అల్లరి నరేష్ నన్ను నమ్మారు. అలా నాతో జర్నీ చేస్తున్నారు. వారితో మరల సినిమాలు తీయడానికి కారణమదే అంటూ హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా అన్నారు.
హాస్య మూవీస్ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. మార్చి 19 న రాజేష్ దండా పుట్టినరోజు సందర్భంగా సినిమా నిర్మాణంలోనూ, భవిష్యత్ సినిమాల గురించి పలు విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.
ఈసారి బర్త్ డే గిఫ్ట్ గా ఏమేమి చేయబోతున్నారు?
స్వామిరారా చిత్రంతో పంపిణీ దారునిగా మొదలై దాదాపు 82 సినిమాలను విడుదల చేశా. ఒక్క క్షణం, నాంది సినిమాలకు సహ నిర్మాతగా పని చేశా. అనిల్ సుంకరతో ప్రయాణం సాగిస్తూ ఊరి పేరు భైరవ కోన, సామజవరగమన వంటి సినిమాలను నిర్మించా. అవి హిట్ కావడంతో ఈ బర్త్ డే గిఫ్ట్ గా మరికొన్ని సినిమాలు సిద్ధం చేసుకున్నా.
మీ బేనర్ లో సొంతంగా సినిమా చేస్తున్నారు?
నేను ఇంతకుముందు కూడా చేసినవి సొంత బేనర్ లోనే. నా కిష్టమైన వారితో నా బేనర్ లో చేయడం చాలా హ్యాపీ, నాంది సినిమా నా జోనర్ సినిమా. బచ్చల మల్లి కూడా నా జోనర్ సినిమా. ఇలా నా కిష్టమైన కథలతో మనుషులతో చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి సుబ్బు దర్శకుడు.
బచ్చల మల్లి ఎలాంటి కథ. సీరియస్ గా ఉంటుందా?
90 దశకంలో కథ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథ ప్రకారం సహజమైన లొకేషన్లలో చేయాలని అన్నవరం, తుని చుట్టుపక్కల విలేజ్ లో షూటింగ్ చేస్తున్నాం. మే 10 నుంచి సాగే సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం.
పెద్ద నిర్మాతలే నిదానంగా చేస్తున్న రోజుల్లో మీరు స్పీడ్ గా చేయడం శాటిలైట్ బిజినెస్ కూడా పొందడం మీకెలా అనిపిస్తుంది?
ఇక్కడ ఒక్కటే కొలమానం. సినిమాలు బాగా ఆడుతున్నాయి కనుక బిజినెస్ జరుగుతుంది. అంతకంటే పెద్ద నిర్మాత చిన్న నిర్మాత అనే తేడా లేదు.
పంపిణీ దారునిగా నిర్మాతగా ఎలా మీకు ఉపయోగపడుతుంది? కాన్సెప్ట్ లు ఎలా అంచనా వేస్తున్నారు?
ఒకరకంగా పంపిణీదారునిగా వున్న అనుభవం చాలా వరకు ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే కొత్తగా వుండే పాయింట్ తో వెళ్లాలన్నది నా పాలసీ. అలాంటి కథలతో భైరవ కోన, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, సామజవరగమన వంటి సినిమాలు తీయగలిగాను.
అల్లరి నరేష్, సందీప్ కిషన్.. వీరితోనే సినిమాలు చేస్తారా? వేరే హీరోతో చేయరా?
అదేం లేదు. రన్నింగ్ లో ఉన్న హీరోలతో కంఫర్టబుల్ గా ఉంటుంది. పైగా నేను పంపిణీదారుడిగా ఉన్నప్పటినుంచి వారు నన్ను నమ్మారు. వారితో జర్నీ చాలా హ్యాపీగా వుంది. అలా అని బయట హీరోతో చేయను అని చెప్పను. త్వరలో బయట హీరోతో చేయబోతున్నా.
సహజంగా మీకు ఏ జోనర్ అంటే ఇష్టం?
కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. అందులో నాకు యాక్షన్ సినిమాలంటే మరీ ఇష్టం. అవి నా సినిమాలో వుండేలా చూసుకుంటాను. అది కూడా కథ ప్రకారం ఉండాలి.
ఒక్కసారి రివ్యూలు మిక్స్ డ్ గా వస్తుంటాయి? అన్ని సినిమాలపై మీరు చూసినప్పుడు మీ అంచనా ఎలా ఉంటుంది?
ఏ సినిమా అయినా కొనుక్కున్న బయ్యర్ కు హిట్ అయితే డబ్బులు వస్తాయి. అది బెటర్ సినిమా అనుకుంటాడు. ఒక్కోసారి కొన్ని సినిమాలు మనకు బాగున్నా రికవరీ అవ్వలేదంటే ప్రేక్షకులకు నచ్చలేదని అర్థం. ఇక రివ్యూలు అంటారా.. వారి అభిప్రాయాలు ఎలాగైనా రాయవచ్చు. భైరవ కోనలో ఓ సాంగ్ వుంది. అది థియేటర్ వరకు తీసుకు వస్తుందని భావించాం. అలాగే జరిగింది. నేడు రెగ్యులర్ సినిమాలకు పెద్దగా ఆడియన్ రావడం లేదు. కానీ భిన్నంగా ఉంటే తప్పకుండా వస్తారు.
చిన్న సినిమాలను తక్కువలో అవ్వగొట్టొచ్చు అనే టాక్ బయట ఉంది? కానీ మీ సినిమాలకు ప్రభాస్ సినిమాకు పనిచేసే కెమెరామెన్, సంగీత దర్శకుడిని తీసుకోవడానికి కారణం?
సినిమాకు కథ తర్వాత ముఖ్యమైనది ఫొటోగ్రఫీ. అది చక్కగా వుంటేనే కంటికి ఇంపుగా వుంటుంది. రంగస్థలం, కోమాలి సినిమాలు నేను చూశాను. సినిమాటో గ్రఫీ అద్భుతంగా వుంది. తను నాకు బాగా తెలుసు. అందుకే నేను తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కూడా ఎంపిక చేశాను. తను బిజీగా వున్నా. నాకోసం చేస్తానని హామీ ఇచ్చాడు. ఇలా మంచి మనుషులతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులకు కూడా ఆ ఫీలింగ్ వుంటేనే కనెక్ట్ అవుతారు. క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయగలుగుతున్నా.
నిర్మాతలకు కథపై కంట్రోల్ ఉండదు. కేవలం క్యాప్ ఇయర్ అనే అపప్రద వుంది. దానికి మీరేమంటారు?
నేను చేసే హీరోలు నాకు పర్సనల్ ఫ్రెండ్స్. నేను అన్నీ స్టడీ చేసి ప్లాన్ చేసుకుంటాను. నాకు నా మాట వినేవారే దొరికారు. అది నా అదృష్టం. ముందు ముందు వేరే హీరోలతో కూడా అలాగే వుండాలని కోరుకుంటా. ఇక సినిమా పరంగా చూస్తే, కథ, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ అన్నీ నేను ప్లాన్ చేసుకుంటా. నా ప్రమేయం అన్నింటిలో ఉంటుంది. పంపిణీదారునిగా వున్న నా అనుభవం ఇలా ఉపయోగపడుతుంది. షూటింగ్ కూడా వెళుతుంటా. నిర్మాతగా కంట్రోల్ అనేది మన చేతుల్లోనే వుంటుంది.
హాస్య మూవీస్ కు ప్రత్యేకతగా మీరు ఏం చేయబోతున్నారు?
హాస్య మూవీస్ తో అన్ని మంచి సినిమాలు కొత్త కథలు తీయడమే ప్రత్యేకత. పలు పెద్ద సంస్థలు తీసినట్లే మా బేనర్ లో మంచి కథాంశాలు, కొత్త కథలు తీయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు తీసినవి ఇలాంటి కొత్త కథలే. రేపు దర్శకుడు త్రినాథ్ తో తీయబోయే సినిమా కూడా భిన్నమైన కథతో ఉంటుంది.
ధమాకా తర్వాత త్రినాథ్ పెద్ద సంస్థలతో చేస్తున్నారనే టాక్ వచ్చింది? అతన్ని మీరెలా లాక్ చేశారు?
ప్రసన్న చెప్పిన కథ బాగా నచ్చింది. పైగా అందరూ సక్సెస్ లో వున్నవారు కలిసి సినిమా చేయాలని చేస్తున్నాం. దానికి అన్నీ కలిసి వచ్చాయి.
ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరింది. మీ బేనర్ లో ఆ స్థాయి సినిమా ఉంటుందా?
తప్పకుండా. పాన్ ఇండియా హీరో, కథ లభిస్తే తప్పకుండా చేస్తా. 2025 లో తప్పకుండా చేస్తా.
కొత్త సినిమాలు?
అల్లరి నరేష్ సినిమా యాభై శాతం పూర్తయింది. తదుపరి సందీప్ కిషన్, కిరణ్ అబ్బవరం సినిమాలు వున్నాయి.
డిజిటల్, శాటిలైట్ వ్యాపారం ఎలా ఉందని భావిస్తున్నారు?
గత ఏడాదితో పోలిస్తే డిజిటల్, శాటిలైట్ బిజినెస్ తగ్గిందనే చెప్పాలి. ఇది చిన్న సినిమాలకే. పెద్ద సినిమాలకు పెద్దగా వర్తించదు. లక్కీగా నా సినిమాలకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. నా మూడు సినిమాలు రిలీజ్ ముందుగానే శాటిలైట్ బిజినెస్ అయిపోయాయి. రేపు రాబోయే సినిమాలు కూడా బిజినెస్ కు సిద్ధంగా వున్నాయి. ఏది ఏమైనా బేనర్, నిర్మాత సక్సెస్ చూసి మార్కెట్ ఉంటుంది. అలా నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎవరు కొన్నా ముందుగా టీజర్ చూసే కొంటారు. అవి నచ్చితేనే ఏ బిజినెస్ అయినా ఈజీగా అవుతుంది.
మీ బేనర్ లో పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండబోతుంది?
వచ్చే ఏడాది తప్పకుండా పెద్ద హీరోతో చేయబోతున్నా. అది ఎవరనేది సస్పెన్స్.
ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలని రూల్ పెట్టుకున్నారా?
అలాంటిది ఏమీ లేదు. మారేడుమల్లి. షూట్ లో ఉండగానే బచ్చల మల్లి కథ విన్నాను. అదేవిధంగా సామజవరగమన షూట్ లో ఉండగా కిరణ్ అబ్బవరం సినిమా అనుకున్నాం. సడెన్ గా వచ్చింది త్రినాథ్ సినిమా.