NTV Telugu Site icon

Rajendra Prasad Birthday Special : నవ్వుల్లో మేటి నటకిరీటి!

Nata Kiriti

Nata Kiriti

 

Rajendra Prasad Birthday Special :

తెలుగు చిత్రసీమ నవ్వుల నావలో పకపకలు పండించిన వారు ఎందరో ఉన్నారు. అయితే కథానాయకునిగా అధిక సంఖ్యలో నవ్వుల పువ్వులు పూయించిన మేటి నటకిరీటి రాజేంద్రప్రసాద్! ఒకప్పుడు హీరోగా కితకితలు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గానూ నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.

గద్దె రాజేంద్రప్రసాద్ 1956 జూలై 19న గుడివాడ సమీపంలోని దొండపాడులో జన్మించారు. ఆ పై మహానటుడు యన్టీ రామారావు సొంతవూరు నిమ్మకూరులో రాజేంద్రుని బాల్యం గడచింది. చిన్నతనం నుంచీ అందరినీ అనుకరిస్తూ చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచేవారు. అదే ఆయనలో అభినయాన్ని ప్రవేశ పెట్టిందని చెప్పవచ్చు. యన్టీఆర్ లాగా తానూ సినిమాల్లో నటించాలన్న అభిలాష కలిగింది. అది రాజేంద్రునితో పాటు పెరిగి పెద్దగా మారింది. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేయగానే సినిమాల్లో నటించాలన్న అభిలాషను తండ్రి ముందు పెట్టారు. తరువాత మద్రాసు చేరి, అక్కడ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నారు రాజేంద్రుడు.

బాపు తెరకెక్కించిన ‘స్నేహం’ సినిమాలో ఓ చిన్న వేషం వేసి తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. ఆరంభంలో పలు సినిమాల్లో చిన్నాచితకా వేషాల్లో అలరించారు. ఆయనకు హీరోగా ‘ప్రేమించు-పెళ్ళాడు’లో తొలి అవకాశం దక్కింది. మ్యూజికల్ హిట్ గా నిలచిన ఆ సినిమా నటునిగా మార్కులు సంపాదించి పెట్టిందే కానీ, కోరుకున్న కమర్షియల్ సక్సెస్ ను అందించలేక పోయింది. తరువాత వంశీ ‘లేడీస్ టైలర్’తో హీరోగా తొలి సక్సెస్ చూశారు రాజేంద్రప్రసాద్. ఆ తరువాత అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తూ కథానాయకునిగా రాజ్యమేలారు రాజేంద్రుడు. ‘ఎర్రమందారం, ఆ నలుగురు’ చిత్రాలతో ఉత్తమ నటునిగా నందిని అందుకున్నారు.

సొంత చిత్రాలు నిర్మించి, చేతులు కాల్చుకున్నాక కేరెక్టర్ యాక్టర్ గా మారారు. బిజీ బిజీగా ఇప్పటికీ సాగుతున్నారు. మధ్యలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షునిగానూ విజయం సాధించారు. ఇప్పటికీ రాజేంద్రప్రసాద్ నవ్వులతోనూ పలు చిత్రాలు జనాన్ని మురిపిస్తున్నాయి. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.