బిగ్ బాస్ హౌస్ లో ఎవరు, ఎప్పుడు, ఎలా లైమ్ లైట్ లోకి వస్తారో చెప్పాలేం! అందరూ అనామకుడు అనుకుంటున్న రాజశేఖర్ మీద బిగ్ బాస్ రెండు రోజులు ఫోకస్ పెట్టే సరికీ అతను సెకండ్ కెప్టెన్ గా ఎంపికైపోయాడు. ఈ సీజన్ లో ఫస్ట్ కెప్టెన్ గా బాలాదిత్య తన బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. ఇక సెకండ్ కెప్టెన్ ఎంపిక విషయానికి వచ్చే సరికీ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో చలాకీ చంటి, ఇనయా రెహ్మాన్, రాజశేఖర్, ఆర్జే సూర్య విజేతలుగా నిలిచి బరిలోకి దిగారు. వీళ్ళలో ఒకరిని ఇంటి కెప్టెన్ గా ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఇద్దరిద్దరు చెప్పున ఏకాభిప్రాయానికి వచ్చి తమ అభిప్రాయం చెప్పారు. అందులో అత్యధికంగా నాలుగు ఓట్లు రాజశేఖర్ కు రాగా ఆర్జే సూర్యకు రెండు ఓట్లు, చలాకీ చంటి, ఇనయాకు ఒక్కో ఓటు వచ్చింది. దాంతో మెజారిటీ సభ్యుల ఎంపిక మేరకు హౌస్ లో సెకండ్ కెప్టెన్ గా రాజశేఖర్ ఎన్నికయ్యాడు.
బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి రాజశేఖర్ పెద్దంత లైమ్ లైట్ లో లేడు. ప్రతి చోట ఆటలో అరటిపండులానే ప్రవర్తించాడు. అయితే ఆ అమాయకత్వమే చివరకు సానుభూతిగా మారి అతను కెప్టెన్ కావడానికి కారణమైంది. ఎదుటి వాడిని కమాండ్ చేయలేని వక్తిని కెప్టెన్ గా పెట్టడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో చంటి, ఇనయా, ఆర్జే సూర్యకు కొందరు ఓటు వేసినా, ‘రాజశేఖర్ కు ఒకసారి ఛాన్స్ ఇవ్వడంలో తప్పులేదు. అతను కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడేమో చూద్దాం’ అనే భావనతో ఎక్కువ మంది అతన్ని బలపరిచారు. చిత్రం ఏమంటే… రాజశేఖర్ వైపు హౌస్ మేట్స్ మొగ్గు చూపుతున్నారని తెలిసిన దగ్గర నుండి కెప్టెన్సీ కన్టెన్డర్ అయిన చలాకీ చంటీ అతన్ని ఆటపట్టిస్తూనే ఉన్నాడు. ఇన్ డైరెక్ట్ గా ఆర్జే సూర్య సైతం రాజశేఖర్ పై కామెంట్స్ చేస్తూనే వచ్చాడు. మిగిలిన ముగ్గురుకీ ఓట్లు పడి తనకూ ఒక్క ఓటు రాకపోవడంతో ఇనయా కన్నీటి పర్యంతమై అలిగింది. ఆమె హర్ట్ కాకుండా కనీసం ఒక్కరైనా ఇనయాకు ఓటు వేయమని రాజశేఖరే తోటి ఇంటి సభ్యులను కోరాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మంచి తనమే ఓ రకంగా రాజశేఖర్ కు హెల్ప్ చేసిందని అనుకోవాలి. టాస్క్ లలో పెర్ఫార్మెన్స్, జనాల ఓటింగ్ మాట ఎలా ఉన్నా… బిగ్ బాస్ హౌస్ లోని మెజారిటీ కంటెస్టెంట్స్ రాజశేఖర్ పక్షాన నిలబడటం విశేషం.
