SSMB29 : ఒక సినిమా విడుదల కాకముందే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం కొత్త విషయం కాదు. అయితే షూటింగ్ పూర్తికాకముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం దిగ్గజ సంస్థలు భారీ మొత్తాలతో పోటీ పడటం మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విషయంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులపై వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రాజమౌళి సినిమా అంటే భారతీయ ప్రేక్షకులకే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత ఆయన రూపొందిస్తున్న తదుపరి ప్రాజెక్ట్ కావడంతో ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాల కారణంగానే సినిమా థియేటర్లలోకి రాకముందే ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలతో ముందుకు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను, శాటిలైట్ హక్కులను కూడా ఒకేసారి సొంతం చేసుకోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం రెండు ప్రధాన సంస్థల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జీ5, జియో హాట్‌స్టార్ ఈ రేసులో ముందున్నాయనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం గానీ, సంబంధిత ఓటీటీ సంస్థలు గానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రాజమౌళి చిత్రాల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి భారీ ఆఫర్లు రావడం ఆశ్చర్యకరం కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ‘వారణాసి’ షూటింగ్‌పై వస్తున్న ప్రతి చిన్న అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మహేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో రాజమౌళి చూపించబోతున్నారనే వార్తలు కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో విదేశీ మార్కెట్‌లో కూడా భారీ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆఫీషియాల్ గా ఒప్పందం ఎవరితో కుదురుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

