యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన “రాజ రాజ చోర” మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై శ్రీ విష్ణు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టంగా కనిపించింది. ఇక ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తుంటే శ్రీ విష్ణు సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగానే ప్రేక్షకులందరూ 6 మాస్కులు తీసుకెళ్లక తప్పేలా కనిపించడం లేదు. సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ట్విట్టర్ లో ఏకంగా రివ్యూ ఇచ్చేస్తున్నారు. సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, ఫస్ట్ హాఫ్ కామెడీ కేపర్ గా సాగిపోతూ నవ్వులు కురిపిస్తుందని, సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, హీరోయిన్ సునైనా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను స్టన్ చేసిందని, మేఘ ఆకాష్ కూడా స్క్రీన్ పై అదిరిపోయిందని అంటున్నారు. ఇక దర్శకుడు హసిత్ గోలి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడట. సాంగ్స్, మ్యూజిక్ కూడా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి “రాజ రాజ చోర” టీం అంతా కలిసి సినిమాతో ప్రేక్షకుల మనసులను చోరీ చేసేశారు.
Read Also : బండ్ల గణేష్ నిర్ణయం మార్చుకున్నాడు !
నిజానికి కరోనా తర్వాత ఓ సినిమాకు ఇంతటి పాజిటివ్ బజ్ రావడం ఇదే మొదటిసారి. థియేటర్లు రీఓపెన్ అయ్యాక చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మాత్రం తిమ్మరసు, ఇష్క్, ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ చిత్రాలు. ఈ సినిమాలన్నింటిలోనూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “ఎస్ఆర్ కళ్యాణమండపం” హిట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత హిట్ మూవీగా నిలిచిన “ఎస్ఆర్ కళ్యాణమండపం” కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఇప్పుడు “రాజ రాజ చోర”కు ఫుల్ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇదే పాజిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడితే… సినిమా ఇండస్ట్రీకి మంచి బూస్ట్ లభించినట్లు అవుతుంది. తర్వాత విడుదలయ్యే సినిమాలన్నీ కూడా ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఇక ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్న “రాజ రాజ చోర”కు విమర్శకుల నుంచి ఎలాంటి టాక్ వస్తుందో తెలియాలంటే సినిమా రివ్యూలు వచ్చే వరకు ఆగాల్సిందే.
యాక్షన్, కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ “రాజ రాజ చోర” చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, సునైనా ప్రధాన పాత్రలు, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషించారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ బాణీలు అందించగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహించారు.
