ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ ‘పల్లకిలో పెళ్ళికూతురు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండీ అడపా దడపా హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి మాత్రం వరించడం లేదు. బట్… రొటీన్ కు భిన్నమైన సినిమాలు చేస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం కోసం రాజా గౌతమ్ ప్రయత్నిస్తుండటం అభినందించదగ్గదే. తాజాగా రాజా గౌతమ్ హీరోగా సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ ‘బ్రేక్ అవుట్’ పేరుతో ఓ సినిమాను నిర్మించారు. బాలకృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల దీనికి సహ నిర్మాతలు.
‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్ ను సోమవారం సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆవిష్కరించారు. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చక్కని విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను బన్నీ వ్యక్తం చేశారు. ‘ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, సినిమా కాన్సెప్ట్ ఆసక్తిని కలిగిస్తోందని, తెలుగు సినిమా రంగంలో ఇలాంటి ప్రయోగాత్మక కథలను యువకులు ప్రయత్నించడం హర్షించదగ్గద’ని అల్లు అర్జున్ అన్నారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ‘బ్రేక్ అవుట్’ మూవీ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఒంటరిగా ఉండటానికి భయపడే ఓ యువకుడు అనుకోని పరిస్థితుల్లో గ్యారేజ్ లో ఇరుక్కుపోతే ఏం జరిగింది? దాని పర్యవసానాలు ఏమిటనేదీ ఈ చిత్ర కథ అని ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. కిరీటి దామరాజు, ‘చిత్రం’ శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
