Site icon NTV Telugu

Raj Tarun: ‘పురుషోత్తముడు’గా రానున్న రాజ్ తరుణ్!

Raj Tharun

Raj Tharun

అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి, ఎలాగైనా ఒప్పిస్తూ సాగుతున్న రాజ్ తరుణ్ ఆరంభంలో భలేగా అలరించాడు. అందుకు తగ్గట్టుగానే విజయాలూ రాజ్ తరుణ్ ను వరించాయి. ఎందుకనో కొంతకాలంగా రాజ్ తరుణ్ కు విజయం మొహం చాటేసింది. అయినా రాజ్ తరుణ్ కు అవకాశాలు వస్తున్నాయంటే, అతని ప్రతిభపై సినీజనానికి నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యే రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ అనే చిత్రం మొదలయింది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టులనూ రాజ్ తరుణ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో రాజ్ రాబోయే చిత్రాలపై సినీజనాల్లో ఒకింత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు.

రాజ్ తరుణ్ 1992 మే 11న విశాఖపట్నంలోని ప్రహ్లాద పురంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ చలాకీగా ఉంటూ చుట్టూ ఉండేవారిని తన మాటలతోనూ, చేతలతోనూ ఆకట్టుకొనేవాడు రాజ్ తరుణ్. ఈ నేపథ్యంలోనే అతనిలో సినిమాలపై ఆసక్తి నెలకొంది. చూడగానే పక్కింటి కుర్రాడికి మల్లే ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ఎస్సెట్ అనీ చెప్పొచ్చు. అనేక లఘు చిత్రాల్లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలన్నది అభిలాష. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు.’ఉయ్యాల జంపాల’ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయసాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో కేరెక్టర్ కు రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని భావించాడు. అలా కోరుకోకుండానే ‘ఉయ్యాల జంపాల’ హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. ఇది చాలా చిన్న సినిమా. కానీ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేశ్ బాబు వంటి పెద్దవారు ఈ చిత్రం రూపకల్పన వెనుక ఉన్నారు. వీరికి తోడు పి.రామ్మోహన్ కూడా సినిమాకు భాగస్వామి. అవికా గోర్ నాయికగా నటించిన ‘ఉయ్యాల జంపాల’ మంచి విజయం సాధించింది. దాంతో రాజ్ తరుణ్‌ నటునిగా బిజీ అయిపోయాడు.

‘ఉయ్యాల జంపాల’ తరువాతి చిత్రం ‘సినిమా చూపిస్త మావ’లోనూ అవికా గోర్ తో జోడీ కట్టాడు రాజ్ తరుణ్. మరో హిట్టు పట్టాడు. ఆపై ‘కుమారి 21 ఎఫ్’లోనూ హీరోగా నటించాడు. అదీ సక్సెస్ చూసింది. ఇలా వరుస విజయాలు చూసిన రాజ్ తరుణ్ కాల్ షీట్స్ కోసం జనం రావడం మొదలెట్టారు. “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే” వంటి చిత్రాల్లో నటించేశాడు రాజ్ తరుణ్. కొన్ని తీపి రుచి చూపిస్తే, మరికొన్ని చేదు అనుభవం మిగిల్చాయి.

రాజ్ తరుణ్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు. అసలు దానిని నమ్ముకొనే కదా, చిత్రసీమలో అడుగు పెట్టింది. అందువల్ల రాజ్ తరుణ్ లోని రచయిత ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో “జానీ జానీ ఎస్ పప్పా…” సాంగ్ రాసేశాడు. తరువాత ‘రంగుల రాట్నం’లో “ప్రేమ ప్రేమా…” అనే పాటనూ పలికించాడు. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలని తపిస్తున్న రాజ్ తరుణ్ సక్సెస్ రేటు నెమ్మదించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలు ముందుగా ఓటీటీలో వెలుగు చూశాకే థియేటర్లలో కనిపించాయి. అయినప్పటికీ మునుపటి విజయం అతని దరి చేరడం లేదు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ‘స్టాండప్ రాహుల్’ వెలుగు చూసి యేడాది దాటింది. రాబోయే ‘పురుషోత్తముడు’పైనే రాజ్ తరుణ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సారి ఏ తీరున అలరిస్తాడో చూడాలి.

Exit mobile version